
సాక్షి, న్యూఢిల్లీ : పాస్‌పోర్ట్ సేవలు మరింత సరళతరం కానున్నాయి. పాస్‌పోర్ట్ సేవా యాప్‌ను విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం ప్రారంభించడంతో పాస్‌పోర్ట్ పొందడం మరింత సులభతరం కానుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాజా యాప్ ద్వారా పాస్‌పోర్ట్ దరఖాస్తును దేశంలో ఎక్కడి నుంచైనా పొందవచ్చని, మొబైల్ ఫోన్ల నుంచే పాస్‌పోర్ట్ దరఖాస్తును నింపవచ్చని చెప్పారు. నూతన పథకాల ద్వారా పాస్‌పోర్ట్ విప్లవం చోటుచేసుకుందని మంత్రి అభివర్ణించారు.
హజ్ యాత్రకు వెళ్లే వందలాది భారత పౌరులకు సరళీకరించిన నూతన పాస్‌పోర్ట్ దరఖాస్తు సులభతరంగా ఉంటుందని అన్నారు. దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్యను పెంచామని, ఇవన్నీ ఇప్పుడు పనిచేస్తున్నాయని చెప్పారు. మరో 38 అదనపు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 260 పాస్‌పోర్ట్ కేంద్రాలు పనిచేస్తుండగా, త్వరలో వాటిని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకూ ప్రభుత్వం విస్తరిస్తుందన్నారు.