వీవీప్యాట్‌లపై విపక్షాలకు సుప్రీం షాక్‌

Supreme Court Rejects Oppositions Review Petition On Vvpats - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వీవీప్యాట్‌ల వ్యవహారంలో విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లతో కనీసం 50 శాతం​ వీవీప్యాట్‌లతో సరిపోల్చాలన్న విపక్షాల అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. విపక్షాల రివ్యూ పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది. 50 శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలంటే వారం రోజుల సమయం పడుతుందన్న ఈసీ వాదనతో కోర్టు ఏకీభవిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

మరోవైపు కోర్టు తీర్పును గౌరవిస్తామని విపక్షాల తరపున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి పేర్కొన్నారు. తమ రివ్యూ పిటిషన్‌ను న్యాయస్ధానం తిరస్కరించిందని చెప్పారు.కాగా విపక్షాల అప్పీల్‌పై గతంలో అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక ఈవీఎంకు బదులుగా ఐదు ఈవీఎంల్లో పోలయిన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని సుప్రీం కోర్టు ఏప్రిల్‌ 8న ఈసీని ఆదేశించింది.

ఎన్నికల ప్రక్రియలో కచ్చితత్వాన్ని పెంపొందించే క్రమంలో ఈ చర్యలు చేపట్టాలని కోరింది. సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులపై ఏప్రిల్‌ 24న 21 రాజకీయ పార్టీలు తిరిగి రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కనీసం 50 శాతం ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చేలా లెక్కించాలని ఆయా పార్టీలు పట్టుబట్టాయి. ఇక కాంగ్రెస్‌, ఎన్సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, ఆప్‌, సీపీఐ, సీపీఎం, టీడీపీ సహా 21 పార్టీలు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top