కోర్టులో ఓ మూలన కూర్చోండి

Supreme Court holds CBI's ex-interim chief Nageswara Rao guilty of contempt - Sakshi

సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు ఆదేశం

ఏకే శర్మ బదిలీ కేసులో లక్ష జరిమానా  

న్యూఢిల్లీ: సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ఓ అధికారిని బదిలీ చేసిన ఘటనలో కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే ఒక మూలన కూర్చోవాలంటూ ఆదేశించింది. అంతేకాదు సాయంత్రం కోర్టు సమయం ముగియక ముందే మరోసారి వెళ్లేందుకు అనుమతి అడగ్గా.. రేపటి వరకూ కోర్టులోనే ఉంటారా.. అంటూ ఆగ్రహించింది. బిహార్‌లోని వసతిగృహాల్లో బాలికలపై లైంగిక దాడికి సంబంధించిన ఘటనలపై విచారణ జరుపుతున్న సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ ఏకే శర్మను అప్పటి సీబీఐ డైరెక్టర్‌ అయిన ఎం.నాగేశ్వరరావు బదిలీ చేశారు. అయితే ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమి తులైన సమయంలోనే ఎటువంటి బదిలీలు చేయడానికి వీల్లేదని కోర్టు అప్పట్లో పేర్కొంది.

అయితే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఆయన బదిలీ చేశారు. దీనికి సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టులో సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు తమ ఉత్తర్వులను ధిక్కరించారని, ఇందుకు గాను ఆయనకు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. నాగేశ్వరరావుతోపాటు సీబీఐ డైరెక్టర్‌ ప్రాసిక్యూషన్‌ బాసూరాం కూడా దోషేనని పేర్కొంటూ ఆయనకూ జరిమానా విధించింది. అలాగే కోర్టు సమయం పూర్తయ్యే వరకు కోర్టు ప్రాంగణంలోనే ఓ మూలన కూర్చోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ ఎల్‌ఎన్‌ రావు, సంజీవ్‌ కన్నాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు వారిరువురు సుప్రీం కోర్టుకు చెప్పిన క్షమాపణలను సైతం న్యాయస్ధానం తోసిపుచ్చింది. కోర్టుకు ఏదైనా చెప్పుకునే అవకాశం ఇస్తామని, అయితే దీనికోసం వారు 30 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చని అని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ఏమైనా చెబుతారా అంటూ వారిద్దరిని ప్రశ్నించింది. ఈ సమయంలో సీబీఐ తరఫున వాదిస్తున్న అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ స్పందిస్తూ.. నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయలేదని, ఇందుకు ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పినట్లు ఆయన న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కోర్టు అనుమతి లేకుండా విచారణ అధికారిని బదిలీ చేయకూడదని నాగేశ్వరరావుకి తెలుసని,   తాను ఏది అనుకున్నానో అదే చేశాను అనేలా ఆయన ధోరణి ఉందని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.

సాయంత్రం వరకూ కోర్టులోనే..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అదనపు డైరెక్టర్‌ నాగేశ్వరరావు, డైరెక్టర్‌ ప్రాసిక్యూషన్‌ బాసూరామ్‌లు సాయంత్రం కోర్టు వేళలు ముగిసే వరకు కోర్టులోనే గడిపారు. అనంతరం కోర్టు నుంచి వెళ్లి పోయారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top