ఇది వారికి జీవన్మరణ సమస్య : సుప్రీం కోర్టు

Supreme Court Dissatisfied Over Rescue Operations To Save Trapped Meghalaya Miners - Sakshi

న్యూఢిల్లీ​: మేఘాలయాలోని ఓ బొగ్గు గనిలో గల్లంతైన 15 మంది కార్మికులను కాపాడటానికి జరుగుతన్న సహాయక చర్యలపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.  కార్మికులను కాపాడే విషయంలో ఆదిత్య ఎన్‌ ప్రసాద్‌ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. కార్మికులను కాపాడటానికి ఆర్మీ సహాయం ఎందుకు తీసుకోలేదని జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం మేఘాలయా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కార్మికులను కాపాడే విషయంలో ప్రతి క్షణం విలువైనదని.. ఇది వారికి జీవన్మరణ సమస్య అని ధర్మాసనం అభిప్రాయపడింది. 

గల్లంతైన వారిని బయటకు తీసుకురావడానికి విస్తృత చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంపై దృష్టి సారించాలని సోలిసిటర్‌ జనరల్‌గా తుషార్ మెహతాను కోరిన ధర్మాసనం.. కార్మికులను కాపాడటానికి  ఏ రకమైన చర్యలు తీసుకున్నారో శుక్రవారం కోర్టుకు తెలియజేయాలని చెప్పింది. కార్మికులను కాపాడటానికి తీసుకున్న చర్యలు ఇంతవరకు ఎందుకు సఫలీకృతం కాలేదని మేఘాలయా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన మేఘాలయా తరఫు న్యాయవాది ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ, కోల్‌ ఇండియా అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారని కోర్టుకు తెలిపారు. అయినా ఆ వివరణతో కోర్టు సంతృప్తి చెందలేదు. 

మేఘాలయలోని ఈస్ట్‌ జైంతా హిల్స్‌ జిల్లా లూమ్‌థారీ ప్రాంతంలోని ఓ అక్రమగనిలో డిసెంబర్‌ 13న ఈ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బొగ్గును వెలికితీస్తున్న క్రమంలో పక్కనే ఉన్న లైటైన్‌ నదీ ప్రవాహం గనిలోకి పోటెత్తింది. ఈ ఘటనలో 15 మంది లోపలే చిక్కుకోగా, ఐదుగురు మాత్రం ప్రవాహానికి ఎదురొడ్డి బయటపడగలిగారు. ప్రమాదం జరిగి 22 రోజులు కావస్తున్న గనిలో కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top