
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల అమ్మకానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్(బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)లకు జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. తమ కోసం రూపొందించిన ఈవీఎంలను రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు (ఎస్‌ఈసీ) కానీ, విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థలకు కానీ తమ అనుమతి లేకుండా అమ్మకూడదని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆ రెండు సంస్థలకు 2017, మే 27న ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.
‘మా సాంకేతిక నిపుణుల కమిటీ ఆమోదించిన ఈవీఎంలను మా అనుమతి లేకుండా వేరే ఎవరికీ అమ్మకూడదం’టూ ఆ సర్క్యులర్‌లో స్పష్టంగా పేర్కొంది. రాష్ట్రాల ఎన్నికల సంఘాలు, విదేశీ సంస్థల కోసం అవసరమైతే వేరే డిజైన్ ఈవీఎంలను రూపొందించాలంది. అయితే, ఈ ఆదేశాలపై గత నవంబర్‌లో జరిగిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ల జాతీయ సదస్సులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు ఒక సమాచార హక్కు విజ్ఞాపన ద్వారా వెల్లడైంది. ఈ విషయాన్ని ఈసీతో చర్చించాలని చివరకు నిర్ణయించారు. ఈసీఐ, ఎస్‌ఈసీ.. రెండూ కూడా ఈసీఐఎల్, బీఈఎల్ సంస్థల నుంచే ఈవీఎంలను కొనుగోలు చేస్తాయి.