భారత్‌- చైనా చర్చలు: బలగాల ఉపసంహరణ!

Sources Says Indian And Chinese Troops Pull Back From Ladakh Area - Sakshi

న్యూఢిల్లీ/బీజింగ్‌: సరిహద్దుల వద్ద మోహరించిన బలగాలను చైనా ఉపసంహరించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ప్రతిగా భారత్‌ సైతం దశలవారీగా సైన్యాన్ని వెనక్కి పిలుస్తున్నట్లు పేర్కొన్నాయి. తూర్పు లడఖ్‌, గాల్వన్‌ లోయ, ప్యాంగాంగ్‌ త్సో సెక్టార్‌ వద్ద చైనా బలగాలు మోహరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దౌత్య, మిలిటరీ స్థాయి చర్చలు జరిగిన అనంతరం శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్‌- చైనాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ మేరకు ఇరు దేశాల విదేశాంగ శాఖలు ప్రకటన విడుదల చేశాయి. (విభేదాలు.. వివాదాలుగా మారకూడదు: చైనా)

ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో మోహరించిన బలగాలను ఇరు దేశాలు ఉపసంహరించుకుంటున్నట్లు సమాచారం.‘‘ ప్రతిష్టంభనకు కారణమైన ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. భారత్‌ కూడా ఈ ప్రక్రియను ఆరంభించింది. పరస్పర అంగీకారంతో ఇరు వర్గాలు ముందుకు సాగుతున్నాయి’’ అని ఓ అధికారి పేర్కొన్నారు. బుధవారం మరోసారి ఇరు వర్గాల మధ్య తూర్పు లడఖ్‌లో చర్చలు జరుగనున్న నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా సరిహద్దు వివాదాలపై చర్చించేందుకు శుక్రవారం భారత విదేశాంగ తరఫున సంయుక్త కార్యదర్శి నవీన్‌ శ్రీవాస్తవ, చైనా విదేశాంగ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ వూ జియాంగోతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు భారత ఆర్మీ లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌, చైనా టిబెట్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. (‘ఏ దేశం ముందూ భారత్‌ తలవంచదు’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top