కేంద్ర కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలు?

Sources Says Historic Decisions Expected In Cabinet Meet Soon - Sakshi

న్యూఢిల్లీ: రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా సమావేశం కానున్న ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లఢక్‌ సరిహద్దులో చైనాతో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో భద్రతా అంశాల కేబినెట్‌ కమిటీ, ఎకనమిక్‌ అఫైర్స్‌ కమిటీ కూడా కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు పూర్తిస్థాయిలో సడలించిన నేపథ్యంలో మాల్స్‌, రెస్టారెంట్లు, ప్రార్థనా స్థలాలు తిరిగి తెరిచేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్‌లాక్‌-1 పునరుద్ధరణ ప్రణాళిక రచించనున్నట్లు సమాచారం. కరోనా సంక్షోభంతో పదకొండేళ్ల కనిష్టానికి జీడీపీ పడిపోవడం సహా ఏప్రిల్‌ నాటికి 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ డేటా సూచించిన తరుణంలో ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. (11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన జీడీపీ)

కాగా ప్రధాన మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోదీ శనివారం దేశ పౌరులకు బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ‘‘నా దేశ పౌరులారా.. గతేడాది ఇదే రోజున భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు భారీ మెజారిటీతో పూర్తిస్థాయి అధికారం కట్టబెట్టారు. మరోసారి 130 కోట్ల భారతీయులకు, దేశ ప్రజాస్వామ్య సంస్కృతికి శిరసు వంచి నమస్కరిస్తున్నా. మీ ప్రేమ, సహృదయత, సహకారం నూతనోత్సహాన్ని, శక్తిని, స్ఫూర్తిని నింపాయి. సాధారణ సమయంలో అయితే మీ మధ్యనే ఉండేవాణ్ణి. అయితే, ఇప్పుడున్న పరిస్థితులు నన్ను అనుమతించటం లేదు. అందుకే ఈ లేఖ ద్వారా మీ ఆశీస్సులు కోరుకుంటున్నా’’అంటూ తన ఏడాది పాలనకు సంబంధించిన విషయాలను ప్రజలతో పంచుకున్నారు.(మరింత అప్రమత్తంగా ఉండాలి : మోదీ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top