
సాక్షి, బెంగళూర్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విందు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కరువు జిల్లా కలబురగిలో సీఎం డిన్నర్ పార్టీ కోసం రూ. పదిలక్షలు వెచ్చించారని బీజేపీ నేత ఆరోపించారు. రాష్ట్రంలో అత్యంత కరువు ప్రభావిత జిల్లాగా కలబురగి రికార్డులకెక్కింది. రైతులు కనీస మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సమయంలో కలబురగిలో కర్ణాటక సీఎం విందు కోసం ఏకంగా పది లక్షలు ఖర్చు పెట్టారని జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ తెల్కూర్ ఆరోపించారు.
సిద్ధరామయ్య రైతులకు క్షమాపణ చెప్పి వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈనెల 16న సీఎం, ఆయన మంత్రివర్గ సహచరులకు విందు ఇచ్చేందుకు జిల్లా అధికారులు రూ.10 లక్షలు ఖర్చు చేశారని అన్నారు.
ఒక్కో ప్లేట్‌కు రూ 800 ఖర్చు చేశారని, కొందరు వీవీఐపీలకు వెండి కంచాలు, బౌల్స్‌లో వడ్డించారని చెప్పారు. బీజేపీ నేత ఆరోపణలపై కలబురగి జిల్లా అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు. కర్ణాటకలో 2018 ప్రధమార్ధంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.