రూపాయి విలువ పడిపోయినా నేనే కారణమా!?

Robert Vadra Fires On BJP Leaders Over Rafale Deal - Sakshi

సాక్షి, న్యూడిల్లీ : ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాఫెల్‌ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. భారత ప్రభుత్వం సూచన మేరకే రిలయన్స్‌ డిఫెన్స్‌ని ఒప్పందంలో భాగస్వామిగా చేసుకున్నట్టు ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండే బాంబు పేల్చిన నాటి నుంచి.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ లక్ష్యంగా.. రాహుల్‌ గాంధీ విమర్శల పర్వం కొనసాగిస్తుంటే మరోవైపు బీజేపీ నేతలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాను టార్గెట్‌ చేశారు. రాబర్ట్‌ వాద్రాకు సంబంధించిన  సంస్థకు రాఫెల్‌ కాంట్రాక్టు దక్కలేదనే అక్కసుతోనే కాంగ్రెస్‌ మోదీ ప్రభుత్వంపై దాడికి దిగుతోందని వారు ఆరోపించారు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై రాబర్ట్‌ వాద్రా స్పందించారు.

ఇప్పటికైనా నిజం చెప్పండి..
రాఫెల్‌ డీల్‌ గురించి కనీసం ఇప్పుడైనా భారత ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వానికి ఉందని వాద్రా వ్యాఖ్యానించారు. అబద్ధాలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మభ్యపెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్‌ ఒప్పందం కోసం భరత జాతిని అమ్మి వేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతీ విషయానికి తనను టార్గెట్‌ చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. బీజేపీదంతా ఓ ప్రహసనమని.. రూపాయి విలువ పడిపోయినా, ఇంధన ధరలు పెరిగినా దానికి కూడా వాద్రానే కారణమనేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.  దర్యాప్తు సంస్థలను సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ వాద్రా ఆరోపించారు.

కాగా యూపీఏ హయాంలో జరిగిన రక్షణ ఒప్పందం కుదర్చడంలో రాబర్ట్‌ వాద్రా సహాయం పొందేందుకు ఓ డిఫెన్స్‌ డీలర్‌.. ఆయనకు లండన్‌లో ఒక ఫ్లాట్‌ బహుమతిగా ఇచ్చారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా లండన్‌ వెళ్లేందుకు వాద్రా కోసం సదరు డీలర్‌  ఫస్ట్‌ క్లాస్‌ టికెట్లు బుక్‌ చేశారంటూ.. అందుకు సంబంధించిన కాపీలను సంబిత్‌ మీడియాకు విడుదల చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top