ఇక నుంచి బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కాంట్రాక్టర్లకు....
సాక్షి,ముంబై: ఇక నుంచి బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కాంట్రాక్టర్లకు అప్పగించిన వివిధ ప్రాజెక్టుల పని తీరును ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా పరిశీలించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించాలని యోచించారు. కాని కొన్ని సాంకేతిక కారణాల వల్ల దీనిని ప్రారంభించలేకపోయారు.
ఈ నెలలో ఈ విధానంలో పనులు ప్రారంభించనున్నట్లు బీఎంసీ ఇంజినీర్ (రోడ్ల విభాగం) అశోక్ పవార్ తెలిపారు. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో బీఎంసీ ఇంజినీర్లు త్వరలోనే నగర రోడ్ల మరమ్మతుల నిర్వహణ, నిర్మాణ పనులను సమయానుసారంగా తమ తమ కార్యాలయాలనుంచే పర్యవేక్షించనున్నారు. కాగా, ఈ వ్యవస్థ నిర్వహణ నిమిత్తం కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.9 కోట్ల ఖర్చు అవుతుందని పవార్ చెప్పారు.
ఈ విధానంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టే కాంట్రాక్టర్లపై కార్పొరేషన్ నిఘా ఉంచవచ్చు. పనిలో నాణ్యతను అప్పటికప్పుడే నిర్థారించవచ్చు. కాగా రోడ్డు పనుల నిమిత్తం తరలిస్తున్న సామాగ్రిపై జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్)ను అమర్చడం ద్వారా వాహనాల కదలికలను కూడా గమనించవచ్చు. ఈ వ్యవస్థను ప్రస్తుతం పింప్రి చించ్‌వడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఉపయోగిస్తోంది. దీంతో ఈ ట్రాకింగ్ చిప్‌లను తమ వాహనాలకు తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందిగా కాంట్రాక్టర్లందరికీ బీఎంసీ ఆదేశించింది.