మీటూ ప్రకంపనలు : ఆ మం‍త్రి చేష్టలతో అవాక్కయ్యా..

Reporter Says UPA Minister Kissed And Groped her - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మీటూ ప్రకంపనలు రాజకీయ పార్టీల్లోనూ పెనుదుమారం రేపుతున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ఎస్‌యూఐ మాజీ చీఫ్‌ను తొలగించగా తాజాగా యూపీఏ వన్‌ హయాంలో ఓ కేంద్ర మంత్రి తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఓ మహిళా జర్నలిస్ట్‌ సంచలన ఆరోపణలు చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన తాను గుజరాత్‌లో ఏషియన్‌ ఏజ్‌ పత్రిక మూతపడటంతో 2006లో ఢిల్లీకి బదిలీ అయ్యానని సోనాల్‌ కెల్లాగ్‌ అనే మహిళా జర్నలిస్టు చెప్పారు. అక్కడ ఓ కేంద్ర మంత్రి వార్తలను కవర్‌ చేసే బాధ్యత తనకు అప్పగించారన్నారు.

సదరు కేంద్ర మంత్రి న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజ్‌లో చదివిన అనంతరం మాస్టర్స్‌ డిగ్రీ కోసం ఇంగ్లాండ్‌ వెళ్లివచ్చారని చెప్పుకొచ్చారు. ఆ మంత్రి తనను కలిసిన ప్రతిసారీ తనను ముద్దు పెట్టుకోవడం చిరాకు తెప్పించేదని కెల్లాగ్‌ డైలీఓకు తనకెదురైన అనుభవాలను వివరిస్తూ వెల్లడించారు. గుజరాత్‌లో రాజకీయ నేతలు ఎన్నడూ ముద్దులు, కౌగిలింతలతో పలకరించేవారు కాదని, ఇది ఢిల్లీ సంస్కృతి అని తాను సరిపెట్టుకున్నానని చెప్పారు.

ఇక 2014లో ఢిల్లీలోని ఎంపీ బంగళాలో మంత్రి తన పట్ల మరోసారి అమర్యాదకరంగా వ్యవహరించారన్నారు. మంత్రి వాష్‌రూమ్‌కు వెళుతూ అనూహ్యంగా తన ఛాతీపై చేయి వేశారని, తనను టచ్‌ చేయవద్దని మంత్రిని గట్టిగా మందలిస్తే ఎందుకు అంటూ ప్రశ్నించారని చెప్పారు. ఇక అప్పటినుంచి తాను మంత్రిని ఎన్నడూ కలవలేదని, మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న క్రమంలోనే తాను మౌనం వీడానని తెలిపారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన ఆ కేంద్ర మంత్రి ఎవరనేది ఆమె వెల్లడించలేదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top