అప్పు ఒక్క రూపాయి... గ్యారెంటీ రూ. 3 లక్షలు

Re 1 In Repayment Of A Loan Bank Refused To Return 138 grams of Gold - Sakshi

చెన్నై : వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం దాటిపోయే బడాబాబులను ఏమి చేయలేని బ్యాంకులు సామాన్యులను మాత్రం పీడించుకు తింటాయి. బ్యాంకు అధికారుల దాష్టీకానికి నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి చెన్నైలో జరిగింది. కేవలం రూపాయి.. ఒకే ఒక్క రూపాయి బకాయి ఉన్నాడనే నేపంతో దాదాపు 3.50 లక్షల రూపాయల విలువైన తాకట్టు బంగారు ఆభరణాలు ఇవ్వకుండా ఓ వ్యక్తిని వేధిస్తున్నారు బ్యాంకు అధికారులు. దాంతో లాభంలేదని భావించిన బాధితుడు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు.

పిటిషన్‌లో ఉన్న వివరాల ప్రకారం.. కాంచీపురం సెంట్రల్ కో - ఆపరేటివ్ బ్యాంక్‌, పల్లవరం శాఖలో సీ. కుమార్‌ తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం 2010, ఏప్రిల్‌ 6న 131 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి 1. 23 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత మరో 138 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రెండు దఫాల్లో మరో 1.65 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. 2011, మార్చి 28న తొలిసారి తీసుకున్న రుణాన్ని వడ్డితో సహా చెల్లించి, 131 గ్రాముల బంగారు ఆభరణాలను విడిపించుకున్నాడు.

అనంతరం కొద్ది రోజుల తర్వాత రెండో సారి తీసుకున్న మొత్తం 1.65 లక్షల రూపాయల రుణాన్ని కూడా చెల్లించాడు. రుణం మొత్తం చెల్లించిన తర్వాత కూడా బ్యాంకు అధికారులు కుమార్‌ గ్యారంటీగా పెట్టిన బంగారు ఆభరణాలను అతనికి తిరిగి ఇవ్వలేదు. అంతేకాక రెండు ఖాతాల్లో చెరో రూపాయి రుణం అలానే ఉంది అని చెప్పారు. రూపాయి రుణం చెల్లిస్తాను నా బంగారాన్ని నాకు ఇవ్వండి అని బ్యాంకు అధికారులను కోరాడు కుమార్‌. అందుకు బ్యాంకు అధికారులు రూపాయిని తీసుకోవడం కుదరదు అని చెప్పి, అతని ఆభరణాలను తిరిగి ఇవ్వడం లేదు.

కుమార్‌ బ్యాంక్‌లో గ్యారెంటీగా ఉంచిన బంగారు ఆభరణాల ప్రస్తుత విలువ 3.50 లక్షల రూపాయలు. ఈ ఆభరణాలను పొందేందుకు కుమార్‌ దాదాపు దాదాపు ఐదు సంవత్సరాలుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. కానీ బ్యాంకు అధికారుల మాత్రం స్పందించడం లేదు. దీంతో సహనం కోల్పోయిన కుమార్‌ తన ఆభరణాలను తనకు ఇచ్చేవిధంగా బ్యాంకుకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా మద్రాస్‌ హై కోర్టులో పిటిషన్‌ వేశాడు. ఈ పిటిషన్‌ గత శుక్రవారం విచారణకొచ్చింది.

ఈ సందర్భంగా కుమార్‌ వాదనలను కోర్టు రికార్డు చేసింది. అంతేకాక కుమార్‌ తరుపు ప్రభుత్వ న్యాయవాది సత్యనాధన్‌కు రెండు వారాల్లోగా ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.  తన ఆభరణాలు పోయుంటాయని, అందుకే అధికారులు రుణం చెల్లించిన తర్వాత కూడా తనను ఇ‍బ్బంది పెడుతున్నారని వాపోయారు కుమార్‌. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top