హేమమాలిని, రాజ్‌బబ్బర్‌ భవితవ్యం తేలేది రేపే

Raj Babbar And Hema Malinis Fates To Be Sealed In Phase 2 Lok Sabha Elections Tomorrow - Sakshi

లక్నో: ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఎన్నికలు ఊపందకున్నాయి. రెండో దశలో ఎన్నికలు జరిగే 8 లోక్‌సభ స్థానాలకు 85 మంది వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి హేమాహేమీలు పోటీపడుతున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌బబ్బర్‌, నిన్నటితరం నటి, బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌గా పేరుగాంచిన హేమామాలిని మరోసారి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. నాగిన(ఎస్సీ), అమ్రోహ, బులంద్‌షార్‌(ఎస్సీ), అలీగడ్‌, హత్రాస్‌(ఎస్సీ), ఫతేఫూర్‌ సిక్రీ, మధుర, ఆగ్రా(ఎస్సీ) లోక్‌సభ స్థానాలకు రెండో దశలో రేపు పోలింగ్‌ జరగనుంది. ఫతేపూర్‌ సిక్రీలో రాజ్‌బబ్బర్‌(కాంగ్రెస్‌), రాజ్‌కుమార్‌ చాహర్‌(బీజేపీ), శ్రీభగవాన్‌ శర్మ(బీఎస్పీ) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

టెంపుల్‌టౌన్‌ మధుర నియోజకవర్గంలో బాలీవుడ్‌ డ్రీమ్‌ గర్ల్‌ హేమామాలిని గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఆర్‌ఎల్‌డీ నుంచి కున్వర్‌ నరేంద్ర సింగ్‌, కాంగ్రెస్‌ నుంచి మహేశ్‌ పాఠక్‌ బరిలో ఉన్నారు. అమ్రోహ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ కన్వర్‌ సింగ్‌ తన్వార్‌, బీఎస్పీ నుంచి నిలబడిన కున్వర్‌ డానిష్‌ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. కున్వర్‌ దానిష్‌ ఇటీవలే జనతాదళ్‌(సెక్యులర్‌) పార్టీ జనరల​ సెక్రటరీ పదవిని వదిలేసి బీఎస్పీలో చేరారు.  ఇప్పుడు జరుగుతున్న 8 లోక్‌సభ స్థానాలన్నీ 2014లో బీజేపీ గెలిచినవే. ప్రస్తుతం ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి నుంచి బీజేపీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది.

రెండో దశలో జరుగుతున్న 8 స్థానాలకు గానూ 6 స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాగిన, అమ్రోహ, బులంద్‌షార్‌, అలీగడ్‌, ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రీ స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తున్నది. ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ పార్టీలు వరసగా హత్రాస్‌, మధుర స్ధానాల్లో అభ్యర్థులను నిలిపింది. రెండో దశలో జరుగుతున్న ఎన్నికలకు గానూ 8,751 పోలింగ్‌ సెంటర్లలో 16,162 పోలింగ్‌బూత్‌లను ఎలక్షన్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top