ఎల్లుండి నుంచి వర్షాలు!

Rains from day after tomorrow all over the Country - Sakshi

     తెలంగాణ, ఏపీలలో 11 నుంచి మూడ్రోజుల పాటు..

     ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం

     దేశవ్యాప్తంగా విభిన్న పరిస్థితులు

     కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు.. మరికొన్ని రాష్ట్రాల్లో వేడిగాలులు

     వెల్లడించిన ఐఎండీ

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ నెల 11 నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న ఐదు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండనున్నట్టు వెల్లడించింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు జమ్మూకశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, హరియాణా, ఛండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ రాజస్తాన్‌ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయని వివరించింది. తూర్పు రాజ స్తాన్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో గాలి దుమారం వీచింది. అతి ఉష్ణ మండల వాతావరణ పరిస్థితులు ప్రస్తుత పరిణామాలకు కారణమని, ఈ నెల 13 నుంచి హిమాలయ ప్రాంతంలో కూడా ఇవే పరిస్థితులు ఉత్పన్నమవు తాయని తెలిపింది. దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో వచ్చే వారం ఇలాంటి పరిస్థితులు ఉంటాయని తెలిపింది. ఈ పరిస్థితుల కారణంగా వాయువ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఈ నెల 13 నుంచి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

తెలంగాణ, ఏపీలలో..
తెలంగాణ, ఏపీలలో 11 నుంచి మూడ్రోజుల పాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈ మధ్యలో భారీ వర్షాలు కూడా పడే అవకాశముందని హెచ్చరించింది. విశాఖ వాతావరణ శాఖ విభాగం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తుంటుందని, ప్రజలు వాటిని గమనిస్తుండాలని సూచించింది. కేరళ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో రానున్న ఐదు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 9, 10, 11, 12 తేదీల్లో దక్షిణ కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే 9న కేరళ, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వివరించింది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో వేడి గాలులు వీస్తాయని వివరించింది. 10న మహారాష్ట్రతో పాటు రాజస్తాన్‌లో కూడా వేడిగాలులు వీస్తాయని తెలిపింది. 11, 12న ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని.. రాజస్తాన్, మహారాష్ట్రలలో వేడి గాలులు వీస్తాయని పేర్కొంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఐఎండీ డైరక్టర్‌ జనరల్‌
దేశవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరి స్థితులపై ఐఎండీ డీజీ కె.జయరాం రమేశ్‌ మంగళ వారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వాతా వరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద, లోహపూరిత నిర్మాణాలైన బస్‌షెల్టర్‌ లాంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలన్నారు. ఇటీవల దేశంలోని 20 రాష్ట్రాల్లో గాలి దుమారం చెలరేగిందని, రుతుపవనాల రాక ముందు ఇలాంటివి సంభవిస్తాయని తెలిపారు. కేరళ, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, ఒడిశా, బెంగాల్‌లో ఈ ప్రభావం అధికంగా ఉందన్నారు. రాజస్తాన్‌లో ఇసుక దుమారం వల్ల ఢిల్లీ చుట్టపక్కల రాష్ట్రాలకు దుమ్ము ప్రభావం ఉంటుందని.. అయితే ఒకసారి వర్షం పడితే దుమ్ము ప్రభావం తగ్గిపోతుందన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీలో 70 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచాయని.. దీంతో ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top