రక్షణ మంత్రి రాజీనామాకు రాహుల్‌ డిమాండ్‌

Rahul Gandhi Slams Nirmala Sitharaman Over Hal Orders - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్‌ ఒప్పందంపై పార్లమెంట్‌లో అసత్యాలు పలికిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఒక అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని అబద్ధాలు చెప్పాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి రాహుల్‌ వ్యాఖ్యానించారు. రఫేల్‌ ఒప్పందంపై ప్రధానిని సమర్ధించేందుకు పార్లమెంట్‌లో ఆమె అసత్యాలు చెప్పారని అందుకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌​ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు రూ లక్ష కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చినట్టు రేపు (సోమవారం) పార్లమెంట్‌లో డాక్యుమెంట్లు చూపాలని లేదా రాజీనామా చేయాలని రక్షణ మంత్రిని ఉద్దేశించి రాహుల్‌ ట్వీట్‌ చేశారు. లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన రూ లక్ష కోట్ల ఆర్డర్ల కోసం హెచ్‌ఏఎల్‌ వేచిచూస్తోందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథన ఆధారంగా రాహుల్‌ గాంధీ రక్షణ మంత్రిని ప్రశ్నించారు. తమకు ఒక్క ఆర్డర్‌ కూడా రాలేదని, రూపాయి కూడా కంపెనీకి విడుదల కాలేదని హెచ్‌యూఏల్‌కు చెందిన సీనియర్‌ అధికారి పేర్కొన్నారని ఆ కథనం తెలిపింది.

రాహుల్‌ క్షమాపణ కోరిన నిర్మలా సీతారామన్‌
హెచ్‌ఏఎల్‌కు ప్రభుత్వ ఆర్డర్లపై లోక్‌సభలో తాను చేసిన ప్రకటనకు సంబంధించి రాహుల్‌ గాంధీ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు. హెచ్‌ఏఎల్‌కు ఆర్డర్లపై టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం పూర్తిగా చదవాలని రాహుల్‌కు చురకలు అంటించారు. హెచ్‌ఏఎల్‌కు రూ లక్ష కోట్ల ఆర్డర్లు ఇచ్చే ప్రక్రియ జరుగుతోందని మాత్రమే తాను చెప్పినట్టు అందులో స్పష్టంగా ఉందన్నారు.

ఆర్డర్లు జారీపై సంతకాలు చేశామని తాను ఎక్కడా చెప్పలేదన్నారు. 2014 నుంచి 2018 వరకూ హెచ్‌ఏఎల్‌కు ప్రభుత్వం రూ 26,570 కోట్ల విలువైన కాంట్రాక్టులు అప్పగిస్తూ సంతకాలు జరిగాయని, మరో రూ 73,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు అప్పగించడంపై సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొంటూ ఆమె ట్వీట్‌ చేశారు. దేశ ప్రజలను తప్పుదారి పట్టించినందుకు రాహుల్‌ పార్లమెంట్‌లో క్షమాపణ చెబుతారా అని నిర్మలా సీతారామన్‌ నిలదీశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top