విజయవంతంగా నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ-48..

PSLV-C48 successfully injects primary satellite RISAT- 2BR1, says ISRO - Sakshi

సాక్షి, సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. షార్‌ మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు  పీఎస్‌ఎల్‌వీ సీ-48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. అయిదేళ్లపాటుసేవలు అందించనున్న ఈ వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మరోవైపు రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. 

పీఎస్‌ఎల్‌వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్‌–2బీఆర్‌1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్‌ అనే ఉపగ్రహాలు, టైవోక్‌–0129, ఆరు ఐహోప్‌శాట్‌ ఉపగ్రహాలు, జపాన్‌కు చెందిన క్యూపీఎస్‌–సార్, ఇటలీకి చెందిన తైవాక్‌–0092, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫ్యాట్‌–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు. 

రిశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. గత మే 22న ప్రయోగించిన రిశాట్‌-2బీకి కొనసాగింపుగా దీన్ని ప్రయోగించారు. ఇక ఇస్రో ప్రయోగాల్లో పీఎస్‌ఎల్వీ రాకెట్‌కు ప్రత్యేక స్థానమున్నది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రాకెట్లలో ఒకటిగా దీనికి పేరుంది. 49 ప్రయోగాల్లో కేవలం రెండు మాత్రమే విఫలమయ్యాయి. మూడో తరం లాంచ్‌ వెహికల్‌ అయిన పీఎస్‌ఎల్వీ.. చంద్రయాన్‌-1, మంగళ్‌యాన్‌ మిషన్లను విజయవంతం చేసింది. కాగా ఇప్పటివరకూ 74 రకాల రాకెట్లను నింగిలోకి పంపిన ఇస్రో... ఈ ప్రయోగంతో ప్లాటినం జూబ్లీని అందుకుంది. అంతేకాకుండా పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 50వ ప్రయోగానికి విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రాయన్‌-1,2, మంగళ్‌యాన్‌-1 వంటి గ్రహాంతర ప్రయోగాలకు వేదికిగా నిలిచింది. 2020లో గగన్‌యాన్‌కు సమాయత్తమవుతోంది.

భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని ప్రయోగాలు
ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ మాట్లాడుతూ... ‘ ఈ రోజు చారిత్రాత్మకమైన 50వ పీఎస్‌ఎల్వీ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించాం. శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగం. 26 సంవత్సరాల పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ విజయాలలో ఎందరో శాస్త్రవేత్తల కృషి ఉంది. పీఎస్‌ఎల్వీని వివిధ రకాలుగా అభివృద్ధి చేశాం. భవిష్యత్‌లో ఎన్నో ప్రయోగాలకు ఇస్రో సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.   ఈ సంద‌ర్భంగా ఇస్రో చైర్మన్‌ ఓ ప్ర‌త్యేక పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. పీఎస్ఎల్వీ ఆధునీక‌ర‌ణ‌లో కృషి చేసిన ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల వివరాలను ఈ పుస్త‌కంలో స‌వివ‌రంగా ప్ర‌చురించారు.

సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు
పీఎస్‌ఎల్‌వీ సీ–48 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top