రాహుల్‌ నివాసానికి పార్టీ ప్రముఖుల క్యూ

Priyanka Gandhi  Ashok Gehlot  Sachin Pilot Rush To Rahul Gandhis Residence - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ చీఫ్‌గా కొనసాగేందుకు రాహుల్‌ గాం‍ధీ అంగీకరించారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్‌తో సమావేశమైన పార్టీ ప్రముఖులు అశోక్‌ గెహ్లాత్‌, సచిన్‌ పైలట్‌, ప్రియాంక గాంధీ తదితరులు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని ఒత్తిడి తేవడంతో ఈ పదవిలో కొనసాగేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. తొలుత పార్టీ చీఫ్‌గా కొనసాగడంపై రాహుల్‌ విముఖత చూపడం, ప్రత్యామ్నాయ నేతను ఎంపిక చేసుకోవాలని స్పష్టం చేయడంతో ఆ పార్టీలో సంక్షోభం తీవ్ర స్ధాయికి చేరింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవిలో కొనసాగాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చేసిన సూచనను రాహుల్‌ తోసిపుచ్చడంతో పార్టీలో హైడ్రామా కొనసాగుతోంది.

మంగళవారం ఉదయం రాహుల్‌ నివాసం కేంద్రంగా హైడ్రామా సాగింది. ఆయన నివాసానికి పార్టీ ప్రముఖులు వరుసగా క్యూ కట్టారు. రాహుల్‌ను కలిసేందుకు మంగళవారం రాజస్ధాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాత్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జీవాలా, సచిన్‌ పైలట్‌ తదితరులు ఆయన నివాసానికి వచ్చారు. తదుపరి కార్యాచరణపై వారు రాహల్‌తో సంప్రదింపులు జరిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయం నేపథ్యంలో రాహుల్‌ రాజీనామా పార్టీని మరింత ఇరకాటంలో పడేసింది. మరోవైపు సార్వత్రిక సమరంలో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పంజాబ్‌, జార్ఖండ్‌, అసోం, యూపీ పార్టీ చీఫ్‌లు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు రాహుల్‌ మెత్తబడటంతో కాంగ్రెస్‌ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. రాహుల్‌ బెట్టు వీడటంతో మంగళవారం జరగాల్సిన వర్కింగ్‌ కమిటీ భేటీ కూడా రద్దయినట్టు సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top