కోవిడ్‌పై వదంతులు నమ్మొద్దు

Prime Minister Narendra Modi awareness about generic medicines - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ:  కోవిడ్‌–19 (కరోనా వైరస్‌)కు సంబంధించి వస్తున్న వదంతులను నమ్మరాదని, వైద్యుల సలహా, సూచనలను కచ్చితంగా పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు షేక్‌హ్యాండ్లను మానేసి ఇతరులను పలకరించేందుకు నమస్కారాన్ని వాడాలని కోరారు. జన్‌ ఔషధి దివస్‌ సందర్భంగా శనివారం ప్రధాని మోదీ కొంతమంది జన ఔషధి దుకాణదారులు, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పీఎంబీజేపీ) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో రకరకాల వదంతులు పుట్టుకొస్తాయి. కొంతమంది వైరస్‌కు దూరంగా ఉండేందుకు ఫలానాది తినమని సలహాలిస్తూంటారు. దయచేసి వేటినీ నమ్మవద్దు. ఏం చేసినా.. వైద్యులు చెప్పినట్లు మాత్రమే చేయండి. మీరే వైద్యులు కావొద్దు’అని ఆయన స్పష్టం చేశారు.

జన ఔషధి పథకం ద్వారా భారీగా లబ్ధి పొందింది ఈ దేశ పేదలు మాత్రమేనని ప్రధాని మోదీ అన్నారు. పీఎంబీజేపీ ద్వారా దేశం మొత్తమ్మీద నెలనెలా కోటి మందికి ఔషధాలు చౌకగా అందుతున్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల జన ఔషధి కేంద్రాల ద్వారా పేదల సొమ్ము రూ.2000 నుంచి 2500 కోట్లు ఆదా చేయగలిగామని వివరించారు. ఈ కేంద్రాల్లో మందులు గరిష్ట అమ్మకం రేటు కంటే 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు లభిస్తాయని వివరించారు. కేన్సర్‌ వ్యాధి చికిత్సకు వినియోగించే మందులు మార్కెట్‌లో రూ.6500 వరకూ ఉంటే జన ఔషధి కేంద్రాల్లో కేవలం రూ.850 మాత్రమే ఉంటుందని ఆయన వివరించారు. ఈ కేంద్రాల నిర్వాహకుల శ్రమను గుర్తించేందుకు అవార్డులు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

మీరు మా దేవుడు...
ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డెహ్రాడూన్‌కు చెందిన దీపా షా అనే మహిళ మాట్లాడుతూ.. ‘నేను దేవుడిని చూడలేదు. కానీ మీలో మాకు దేవుడు కనిపిస్తున్నాడు’ అని వ్యాఖ్యానించడంతో ప్రధాని ఉద్వేగానికి గురయ్యారు. కాసేపు ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. 2011లో పక్షవాతానికి గురైన దీపా మాట్లాడుతూ.. ‘మొదట్లో నా∙మందుల ఖర్చు చాలా ఎక్కువగా ఉండేది. జన ఔషధి కేంద్రాల కారణంగా నెలకు రూ.3500 ఆదా చేయగలుగుతున్నాను’ అని మోదీతో చెప్పారు. ‘మీరు మీ ఆత్మస్థైర్యంతో∙వ్యాధిని జయించారు’అని మోదీ ఆమెతో  అన్నారు. సుమారు 3.5 లక్షల మంది ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో భాగమయ్యారని, మూడు లక్షల మంది వృద్ధులకు పింఛన్‌ లభిస్తోందని ప్రధాని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top