సీఏఏ చరిత్రాత్మకం

President Ram Nath Kovind hails Citizenship Amendment Act as historic - Sakshi

నిరసనల పేరుతో హింస తగదు

పార్లమెంట్‌ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి కోవింద్‌

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్ముని ఆశయ సాధనకు కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) చారిత్రకమైందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. నిరసనల పేరుతో కొందరు హింసకు పాల్పడటం దేశాన్ని, సమాజాన్ని బలహీనపరుస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం రాష్ట్రపతి పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి అధికార పక్షం నేతలు బల్లలు చరుస్తూ మద్దతు ప్రకటించగా ప్రతిపక్షం నిరసన ప్రకటించింది. సుమారు 70 నిమిషాల పాటు జరిగిన రాష్ట్రపతి కోవింద్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే...

బడ్జెట్‌ సమావేశం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను పార్లమెంటుకు తీసుకువస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

నెరవేరిన గాంధీజీ ఆశయం..
సీఏఏకు వ్యతిరేకంగా దేశంలో నిరసనల పేరుతో హింస చెలరేగడం సరికాదు. సర్వమత సమానత్వం భారత్‌ చిరకాలంగా నమ్ముతున్న సూత్రం. దేశ విభజన సమయంలో ఈ నమ్మకంపై తీవ్రమైన దాడి జరిగింది. పాకిస్తాన్‌లో నివసించేందుకు ఇష్టపడని హిందువులు, సిక్కులు భారత్‌కు తిరిగి రావచ్చు. అలా వచ్చిన వారు ఇక్కడ సాధారణ జీవితం గడిపేలా చేయడం ప్రభుత్వ బాధ్యతని మహాత్మాగాంధీ ఎప్పుడో చెప్పారు. ఆయన ఆకాంక్షలను గౌరవించడం అందరి బాధ్యత. ఉభయసభలు ఆ బాధ్యతను నెరవేర్చడం సంతోషకరమైన విషయం. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా సీఏఏ అమల్లోకి రావడం సంతోషకరం. పాకిస్తాన్‌లో జరుగుతున్న నాన్‌కానా సాహెబ్‌ గురుద్వారాపై దాడి వంటి ఘటనలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు రావాల్సిన బాధ్యత మనపై ఉంది. అంతర్జాతీయ సమాజం కూడా ఇలాంటి ఘటనలను ఖండించడంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలి.

దేశీయ ఉత్పత్తులనే కొనండి...
దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు రికార్డు స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రజలు స్థానికంగా తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి. ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రామజన్మభూమి అంశంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఉంచిన నమ్మకాన్ని బలపరిచేదిగా ఉంది. ఈ తీర్పుపై దేశ ప్రజలు స్పందించిన తీరు ప్రశంసార్హమైంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానమైన హక్కులు సాధించుకోవడం ద్వారా జమ్మూ కశ్మీర్, లడాఖ్‌ ప్రజలూ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు.

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు ఓ చారిత్రక ఘట్టం. జాతి ప్రయోజనాల కోసం ప్రతి వ్యక్తి తన బాధ్యతలు గుర్తెరిగి నడుచుకునేలా చేయాలి. అందరం కలిసికట్టుగా ఈ దశాబ్దాన్ని తమ బాధ్యతలను నెరవేర్చేందుకు అంకితం చేద్దాం. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఎన్నో రికార్డులు సృష్టించింది. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ నియామకం త్రివిధ దళాల మధ్య సమన్వయం సాధించేందుకు దోహదపడుతుంది. ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. మహిళల భద్రత కోసం 1,000 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మహిళలకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు ఇవి దోహదపడతాయి.

సభలో తొలిరోజు..
► సమావేశానికి ముందుగా రాష్ట్రపతి కోవింద్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌కు తోడ్కొని వచ్చారు.

► మొదటి వరుసలో ప్రధాని మోదీతోపాటు మంత్రులు థావర్‌ చంద్‌ గహ్లోత్, ఎస్‌.జైశంకర్, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, తదితరులతోపాటు ప్రతిపక్షం నుంచి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాత్రమే ఆసీనులయ్యారు.

► కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ మొదటి వరసకు బదులుగా శశి థరూర్, మనీష్‌ తివారీ తదితరులతో కలిసి ఐదో వరుసలో కూర్చున్నారు.

► రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు తెలుపుతున్న నిరసనలను  టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఒబ్రియాన్‌ తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తూ కనిపించారు.

► బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ)కి చెందిన అతుల్‌ రాయ్‌  లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాయ్‌.. రేప్‌ కేసులో అరెస్టై జైలులో ఉన్నారు. కోర్టు పెరోల్‌ ఇవ్వడంతో ప్రమాణం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top