వివాదాలు, అనవసర చర్చలొద్దు

President Ram Nath Kovind Delivers Independence Day 2018 Speech - Sakshi

ఎన్నో ఏళ్ల లక్ష్యాలు నెరవేరే కీలక దశలో ఉన్నాం

స్త్రీలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజానిదే

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి సందేశం

న్యూఢిల్లీ: ఏ లక్ష్యాలను సాధించేందుకు ఎంతో కాలంగా మనం ఎదురుచూస్తున్నామో ఆ లక్ష్యాలు నెరవేరే కీలక దశలో ప్రస్తుతం దేశం ఉందనీ, ఇలాంటి సందర్భంలో వివాదాస్పద అంశాలు, అనవసర చర్చలకు ప్రజలు తావీయకూడదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విజ్ఞప్తి చేశారు. దేశంలో మూకహత్యలు జరుగుతున్న తరుణంలో ఆయన ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. బుధవారం 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోవింద్‌ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు.

త్వరలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ‘హింస కన్నా అహింస ఎంతో గొప్పది’ అంటూ మహాత్ముడు ఉద్బోధించిన మాటలను ఆయన గుర్తు చేశారు. ‘విద్య అంటే కేవలం ఓ డిగ్రీనో, ఓ డిప్లొమానో కాదు. ఇతరుల జీవితాన్ని మెరుగుపరిచేందుకు సాయం చేసే నిబద్ధతే విద్య. అలాగే భారత్‌ అంటే కేవలం ప్రభుత్వం కాదు. భారత్‌ భారత ప్రజలందరిదీ. అదే భారత స్ఫూర్తి’ అని అన్నారు. మహిళలకు స్వేచ్ఛ, బహిరంగ మలవిసర్జన నిర్మూలన తదితర అంశాలను కోవింద్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

చరిత్ర చూడని కీలక దశ ఇది
‘ఎన్నడూ చూడని కీలక దశలో దేశం ఇప్పుడు ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లక్ష్యాలు  నెరవేరబోతున్నాయి. తీవ్ర దారిద్య్రాన్ని నిర్మూలించబోతున్నాం. బహిరంగ మలవిసర్జన రహితంగా దేశం మారుతోంది. ప్రజలందరికీ ఇళ్లు, విద్యుత్తు తదితర కలలన్నీ సాకారం కాబోతున్నాయి. దేశంలో మార్పు, అభివృద్ధి వేగంగా జరుగుతున్నాయి’ అని అన్నారు. క్యూ లైన్లలో ఒకరిని దాటుకుని మరొకరు ముందుకు పోకుండా, తమకు ముందున్న వారి పౌర హక్కులను గౌరవించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ఇది చాలా చిన్న సూచన. దీనికి అందరం కట్టుబడి ఉందాం’ అని కోరారు.

మహిళలకు స్వేచ్ఛ ఉంది
‘మన తల్లులు, సోదరిలు, కూతుర్లకు వారికి ఇష్టమైన జీవితాన్ని గడిపేందుకు, ఆశలను నెరవేర్చుకునేందుకు స్వేచ్ఛ ఉంది. వారి సామర్థ్యాలను నిరూపించుకునేందుకు, భారత కార్మిక శక్తిలో భాగమయ్యేందుకు, కంపెనీల్లో ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు వారికి సంపూర్ణ హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను వినియోగించుకునే వీలును సమాజం కల్పించాలి. అలాగే వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా సమాజంపై ఉంది’ అని అన్నారు. దేశంలో గోప్యత, మహిళలకు భద్రత ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top