ప్రిలిమినరీ పరీక్షపై స్టేకు నో | Preliminary examination Know to Stay no | Sakshi
Sakshi News home page

ప్రిలిమినరీ పరీక్షపై స్టేకు నో

Aug 20 2014 1:45 AM | Updated on Sep 22 2018 7:37 PM

సివిల్‌సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై స్టే విధించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే, అంధులైన అభ్యర్థులకు రెండేరెండు సీట్లు రిజర్వు చేయడం పట్ల యూపీఎస్‌సీపై, ఇతర కేంద్రప్రభుత్వ విభాగాలపై మండిపడింది.

1,291 ఖాళీల్లో  అంధులకు రెండే పోస్టులా?
కేంద్రంపై మండిపడిన ఢిల్లీ హైకోర్టు

 
న్యూఢిల్లీ: సివిల్‌సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై స్టే విధించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే, అంధులైన అభ్యర్థులకు రెండేరెండు సీట్లు రిజర్వు చేయడం పట్ల యూపీఎస్‌సీపై, ఇతర కేంద్రప్రభుత్వ విభాగాలపై మండిపడింది. అంధులకు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రెండు సీట్లు మాత్రమే కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లాలు విచారించారు. పిటిషనర్ అభ్యర్థనలో న్యాయముందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అయితే, దీనికారణంగా ప్రిలిమినరీ పరీక్ష ఆపడానికి నిరాకరించింది. అంధులకు రెండుసీట్లు రిజర్వు అయ్యాయనే నెపంతో పరీక్ష రాసిన అంధ అభ్యర్థులనెవరినీ అనర్హులుగా ప్రకటించవద్దని యూపీఎస్‌సీని ఆదేశించింది. అంతేకాక మెయిన్స్ పరీక్షలు జరిగేలోగా వికలాంగుల కోటాను సరిదిద్దాలని ఆదేశించింది.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1,291సివిల్‌సర్వీసెస్ పోస్టుల్లో వికలాంగులకు 26 పోస్టులు కేటాయించగా, అంధులకు రెండు సీట్లే కేటాయించారని పిటిషనర్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. బధిరులకు, ఇతర వికలాంగులకు మాత్రం చెరి 12 పోస్టుల చొప్పున కేటాయించారని పిటిషన్‌లో తెలిపారు. కాగా, వికలాంగుల చట్టం సెక్షన్ 33 ప్రకారం మొత్తం  ఖాళీల్లో మూడు శాతం పోస్టులు వికలాంగులకు కేటాయించాలని, అందులో ఒకశాతం అంధులకు రిజర్వు చేయాలనే నిబంధన ఉందని‘సంభావన’ పేర్కొంది. అయితే, యూపీఎస్‌సీ మాత్రం దీనిని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. దీనిని న్యాయమూర్తులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై రెండువారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేసును వచ్చేనెల మూడుకు వాయిదా వేసింది. అప్పటిలోగా పూర్తివివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.షెడ్యూల్ ప్రకారం ప్రిలిమ్స్ నిర్వహించుకోవచ్చునని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement