
విద్యుత్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులివ్వండి
తెలంగాణలో విద్యుత్, పారిశ్రామిక ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతులు సత్వరమే ఇచ్చేలా కేంద్రం చర్యలు...
- కేంద్రానికి మంత్రి జోగు రామన్న విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో విద్యుత్, పారిశ్రామిక ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతులు సత్వరమే ఇచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం పథకంలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుంచి 33 శాతానికి పెంచడంతో పాటు కేంద్ర పథకాలను అమలు చేసేందుకు రూ.500 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ఢిల్లీలో నిర్వహిస్తున్న రాష్ట్రాల అటవీ శాఖల మంత్రుల సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. పాజెక్టులకు పర్యావరణ అనుమతుల జాప్యం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. సామాజిక అటవీపరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటేందుకు కాంపా నిధుల్లోంచి రూ.416 కోట్లు విడుదల చేయాలని విన్నవించారు. రక్షిత మంచినీటి పథకం, గ్యాస్‌పైపులైన్ల కోసం అటవీ, పర్యావరణ అనుమతుల్లో మినహాయింపు నివ్వాల న్నారు.
అటవీ రక్షిత ప్రాంతాల్లోని భూముల్లో కొంత శాతాన్ని అభివృద్ధి పనులకు వినియోగించుకోడానికి చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులు, పర్యావరణ పరిరక్షణ సమతుల్యం చేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాన్ని సదస్సులో వివరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా ఉందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. తెలంగాణకు రావాల్సిన హక్కులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.