వారికి అధికారమే ఆక్సిజన్‌

Power like oxygen for some people - Sakshi

అధికారం లేకుంటే బతకలేరు

విపక్షాలపై ధ్వజమెత్తిన మోదీ

విపక్షంలో ఉన్నప్పటికీ అటల్‌జీ రాజీపడలేదని వ్యాఖ్య  

న్యూఢిల్లీ /ఖుర్దా(ఒడిశా): కొందరికి రాజకీయ అధికారం ఆక్సిజన్‌ లాంటిదనీ, అది లేకుండా వాళ్లు బతకలేరని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. విపక్షాలను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయి తన జీవితాంతం విలువలకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. వాజ్‌పేయి 94వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖచిత్రం ఉన్న రూ.100 స్మారక నాణేన్ని మోదీ ఆవిష్కరించారు.

వాజ్‌పేయి జీవితం ప్రజలకు అంకితం..
‘కొందరు వ్యక్తులకు రాజకీయం ఆక్సిజన్‌గా మారింది. అది లేకుంటే వాళ్లు బతకలేరు. కానీ దివంగత వాజ్‌పేయి తన జీవితంలో ఎక్కువకాలం విపక్షంలోనే గడిపారు. కానీ ఆయన ఎప్పుడూ దేశం కోసమే మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాల విషయంలో రాజీ పడలేదు. జీవితంలో ప్రతీ క్షణాన్ని ప్రజల సంక్షేమం కోసమే ఆయన వెచ్చించారు. వ్యక్తిగతంగా, పార్టీ కంటే కూడా వాజ్‌పేయి దేశానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన జన్‌సంఘ్‌ను ఏర్పాటు చేశారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆయన తన సహచరులతో కలిసి జనతా పార్టీలో చేరారు. అక్కడ కూడా ‘అధికారంలో ఉండటమా? లేకపోతే సిద్ధాంతాలను కాపాడుకోవడమా?’ అన్న ప్రశ్న ఉదయించినప్పుడు ప్రభుత్వం నుంచి బయటికొచ్చి బీజేపీని స్థాపించారు. ఒక్కో ఇటుక పేర్చినట్లు ఆయన పార్టీని నిర్మించారు. ఆయనవల్లే ఈరోజు బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది’ అని తెలిపారు.  

ఒడిశాలో అవినీతి భూతం..
ఒడిశాను అవినీతి భూతం పట్టిపీడిస్తోందనీ, రాష్ట్రంలో కమీషన్లు–వాటాల సంస్కృతి యథేచ్ఛగా సాగుతోందని ప్రధాని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఒడిశాకు భారీగా నిధులు ఇస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం అసమర్థత, అవినీతి కారణంగా రాష్ట్రం ఇంకా వెనుకబడే ఉందని వ్యాఖ్యానించారు. ఒడిశాలో ఐఐటీ–భువనేశ్వర్‌ నూతన క్యాంపస్‌ను ఆవిష్కరించిన మోదీ, దాదాపు రూ.14,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ..‘కేంద్రం భారీగా నిధులిస్తున్నా, రాష్ట్రం వెనుకపడే ఉంది. స్వచ్ఛభారత్‌లో దేశం 97 శాతం  పరిశుభ్రతను సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడమే లేదు. బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా మారడంలో ఒడిశా వెనుకబడింది’ అని అన్నారు.

పారాదీప్‌–హైదరాబాద్‌ పైప్‌లైన్‌కు శంకుస్థాపన..
ఒడిశాలోని పారాదీప్‌–తెలంగాణలోని హైదరాబాద్‌ల మధ్య రూ.3,800 కోట్లతో గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటుకు, అలాగే జార్ఖండ్‌లోని అంగుల్‌–బొకారో ప్రాంతాల మధ్య రూ.3,437 కోట్ల వ్యయంతో గెయిల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. పారాదీప్‌–హైదరాబాద్‌ల మధ్య 1,200 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ పైప్‌లైన్‌ కారణంగా ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు లబ్ధి పొందనున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా బరంపురం, విశాఖ, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల్లో డెలివరీ కమ్‌ పంపింగ్‌ స్టేషన్లు నిర్మిస్తారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top