దారి తప్పిన ఎన్‌కౌంటర్‌

Political parties condemn civilian deaths in Jammu and Kashmir's Pulwama - Sakshi

కశ్మీర్‌లో జవాన్ల కాల్పుల్లో ఏడుగురు పౌరుల దుర్మరణం

ముగ్గురు ఉగ్రవాదులతోపాటు ఓ జవాన్‌ మృతి

బలగాలపై గ్రామస్తుల రాళ్లదాడి

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య శనివారం భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు హతమార్చగా, ఉగ్రమూకల కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్‌ అమరుడయ్యారు. మరోవైపు ఉగ్రవాదులకు మద్దతుగా భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న స్థానికులు భద్రతాబలగాలపై దాడికి దిగారు. దీంతో ఆత్మరక్షణ కోసం బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఎన్‌కౌంటర్‌లో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో రాజకీయ పార్టీలన్నీ గవర్నర్‌ సత్యపాల్‌మాలిక్‌పై దుమ్మెత్తిపోశాయి. దీంతో గవర్నర్‌ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ విషయమై పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘పుల్వామాలోని సిర్ణూ గ్రామంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘావర్గాల నుంచి మాకు పక్కా సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించాయి. అయితే బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోగా, ఓ జవాన్‌ అమరుడయ్యారు. మృతుల్లో గతేడాది జూలైలో ఆర్మీ నుంచి పారిపోయి ఉగ్రవాదుల్లో చేరిన సిర్ణూవాసి జహూర్‌ అహ్మద్‌ ఉన్నాడు. జహూర్‌ అహ్మద్‌ను బలగాలు చుట్టుముట్టినట్లు తెలుసుకున్న సిర్ణూ గ్రామస్తులు భారీ సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. బలగాలపై రాళ్లదాడికి దిగారు. ఆర్మీ వాహనాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు గాల్లో కాల్పులు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో భద్రతాబలగాలు ఆత్మరక్షణ కోసం రాళ్లమూకపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపారు.

అది ఊచకోతే: విపక్షాలు
పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. కశ్మీర్‌లో భద్రతాబలగాలు పౌరుల ఊచకోతకు పాల్పడ్డాయని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా విమర్శించారు. సొంత ప్రజలను చంపుకోవడం ద్వారా ఏ దేశం కూడా యుద్ధంలో విజయం సాధించలేదని పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ అన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top