పార్టీ మారితే మంత్రి పదవులా?

PM releases book on Vice President Venkaiah Naidu's one year in office - Sakshi

ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. ప్రజాస్వామ్య పరిరక్షణ పార్టీల బాధ్యత

చట్టసభలపై ప్రజల్లో నమ్మకం పెంచేలా కృషిచేయాలి

రాజ్యసభ చైర్మన్‌గా తన అనభవాల పుస్తకావిష్కరణలో వెంకయ్య

పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. హాజరైన మాజీ ప్రధానులు

సాక్షి, న్యూఢిల్లీ: భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ నేతలపై కాకుండా రాజకీయ పార్టీలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఇంకో పార్టీలో మంత్రులను చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. చట్టసభల పనితీరు పట్ల ప్రజల్లో నమ్మకం పునరుద్ధరించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో సమగ్రమైన ప్రవర్తనా నియమావళిని రూపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఏడాది కాలంలో తన అనుభవాలు, చేపట్టిన కార్యక్రమాలతో ‘మూవింగ్‌ ఆన్, మూవింగ్‌ ఫార్వర్డ్‌: ఎ ఇయర్‌ ఇన్‌ ఆఫీస్‌’ పేరుతో రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. పారదర్శకత, జవాబుదారీతనం కోసమే తన ఏడాది ప్రయాణానికి పుస్తక రూపం కల్పించినట్లు వెంకయ్య తెలిపారు. ‘ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరేవారు ముందుగా రాజీనామా చేసి పార్టీ వీడాలి.

లేదంటే అలాంటి వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలి. నేను దీన్నే అనుసరించి ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నా. ఒక పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా గెలుపొంది ఇంకో పార్టీలో మంత్రులవ్వడం ఏంటి? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చట్టసభలపై ప్రజల్లో నమ్మకం కలిగేలా రాజకీయ పార్టీలు సమగ్ర నియమావళిని రూపొందించుకోవాలి’ అని వెంకయ్య పిలుపునిచ్చారు.  

వివక్షరహిత భారతమే లక్ష్యంగా..
లింగ, కుల, మత వివక్షను ఏ జాతీయవాదీ ఉపేక్షించబోరని, ప్రతి ఒక్కరూ ఇదే విధానాన్ని అవలంబించాలని వెంకయ్య సూచించారు. ‘మరింత సమగ్రమైన సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కాలి. మరీ ముఖ్యంగా ఇంతవరకు ప్రాతినిధ్యానికి దూరంగా ఉన్న వారికి అవకాశం ఇవ్వాలి. రాజకీయాలను ప్రక్షాళన చేసుకుని.. వ్యవసాయ రంగం, యువ భారతం ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంటరీ, పాలనా వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా దృష్టిలో భారత్‌మాతాకీ జై అంటే జాతీయవాదమే. ఇది కుల, మతాలకు అతీతంగా 130 కోట్ల మందికి జై కొట్టినట్లే’  అని వెంకయ్య పేర్కొన్నారు. భారత ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు, అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను చూసి సంబరాలు చేసుకోవాల్సిన సమయమిది. అయితే పార్లమెంటు నడుస్తున్న విధానంతోనే కాస్త అసంతృప్తి ఉంది’ అని వెంకయ్య చెప్పారు.

రాష్ట్రాల్లో ఎగువసభల ఆవశ్యకతపై..
రాష్ట్రాల్లో ఎగువసభల ఆవశ్యకతపై ఓ జాతీయ విధానం అవసరం ఉందని వెంకయ్య పేర్కొన్నారు. సభ లోపల, బయట సభ్యుల ప్రవర్తనా నియమావళిపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని సూచించారు. కులం, మతం ఆధారంగా ఎవరిపైనైనా వివక్ష చూపడాన్ని ఏ జాతీయవాదీ సహించబోరన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్, దేవెగౌడ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తదితరులు పాల్గొన్నారు.

క్రమశిక్షణ నిరంకుశత్వమా?: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం పెరిగిపోతోందంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణతో ఉండమంటే నిరంకుశుడనే ముద్రవేస్తున్నారని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. ‘వెంకయ్యనాయుడు క్రమశిక్షణతో నడుచుకునే వ్యక్తి. కానీ క్రమశిక్షణను అప్రజాస్వామికం అని విమర్శించేలా డిక్షనరీలో అర్థాలు వెతుకుతున్నారు. ఓ వ్యక్తి క్రమశిక్షణగా ఉండాలని పిలుపునిస్తే.. ఆయన్ను నిరంకుశుడిగా ముద్రవేస్తున్నారు. కానీ వెంకయ్యనాయుడు మాత్రం ఆయన చెప్పే క్రమశిక్షణను ఆచరించి చూపిస్తారు’ అని ప్రధాని పేర్కొన్నారు. వెంకయ్య బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలసి ఒక కార్యకర్తగా పనిచేశానని, లక్ష్య సాధనలతో స్పష్టమైన ప్రణాళికలతో పనిచేస్తారని ప్రశంసించారు.

‘వెంకయ్య నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తుంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆయన వాచీ పెట్టుకోరు. జేబులో పెన్ను, డబ్బులు పెట్టుకోరు. కానీ సరైన సమయానికి కార్యక్రమాలకు హాజరవుతారు. ఆయన స్వభావంలోనే క్రమశిక్షణ ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘వెంకయ్యకు కీలకమైన శాఖను అప్పజెప్పేందుకు నాటి ప్రధాని వాజ్‌పేయి సిద్ధమైతే.. గ్రామీణాభివృద్ధి శాఖను వెంకయ్య ఎంచుకున్నారు. అదే ప్రజలపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం’ అని గుర్తుచేశారు. ‘సభ సజావుగా జరుగుతున్నప్పుడు స్పీకర్‌ స్థానంలో ఎవరున్నారనే దానిపై పెద్దగా దృష్టిపెట్టం. కానీ వారు ఆ స్థానంలో ఉన్నందుకే సభ ప్రశాంతంగా సాగుతుందనే విషయాన్ని మరవొద్దు’ అని మోదీ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top