
ప్రధాని మోదీతో కరచాలనం చేస్తున్న శ్రీలంక ప్రధాన మంత్రి మహిందా రాజపక్స
న్యూఢిల్లీ: శ్రీలంకలోని తమిళుల సమస్యలను పరిష్కరించాలని, వారి హక్కుల కోసం అక్కడి రాజ్యాంగంలో ఉద్దేశించిన నిబంధనలను అమలు చేయాలని శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సను ప్రధాని మోదీ కోరారు. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, తమిళుల సయోధ్య ప్రక్రియను అమలు చేయాలని కోరారు. ఇందుకోసం శ్రీలంక రాజ్యాంగంలోని 13వ సవరణను అమలుచేయాలని తెలిపారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు చేరుకున్న రాజపక్స శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
శ్రీలంకలో తమిళుల జీవన ప్రమాణాల పెంపు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవడం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు విస్తృ్తత స్థాయి చర్చలు జరిపారు. శ్రీలంకలో తమిళుల సమస్యల పరిష్కారానికి కొలంబో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మత్స్యకారుల సమస్యలపై మానవతా కోణంలో స్పందించాలని ఇరుదేశాలు నిర్ణయించాయని వెల్లడించారు. ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో సహకారం అందించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాజపక్స కృతజ్ఞతలు తెలిపారు.