యోగా సంబరం నేడే

PM Modi to lead enthusiasts in Dehradun for Yoga Day - Sakshi

డెహ్రాడూన్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఔత్సాహికులు గురువారం యోగాసనాలు వేసేందుకు సమాయత్తమయ్యారు. డెహ్రాడూన్‌లోని అటవీ పరిశోధన సంస్థ మైదానంలో జరిగే ప్రధాన కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సుమారు 55 వేల మంది పాల్గొననున్నారు. బుధవారం రాత్రే మోదీ డెహ్రాడూన్‌కు చేరుకున్నారు. 

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 5వేల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయు ష్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఢిల్లీతో పాటు వేర్వేరు రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలకు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఢిల్లీలో 8 చోట్ల ఈ వేడుకలు జరగనుండగా, ప్రధాన కార్యక్రమానికి రాజ్‌పథ్‌ ఆతిథ్యమివ్వనుంది. బ్రహ్మకుమారీలు ఎర్రకోట వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమంలో బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌ దళాలకు చెందిన మహిళా సిబ్బందితోపాటు 50 వేల మంది పాల్గొననున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అక్కడి భారత రాయబార కార్యాలయాలు ఏర్పాట్లు చేశాయి. గుజరాత్‌వ్యాప్తంగా జరిగే యోగా వేడుకల్లో 1.25 కోట్ల మంది పాల్గొననున్నారు. అందులో 8 వేల మంది దివ్యాంగులు, 4 వేల మంది గర్భిణీలున్నారు. గిన్నిస్‌ రికార్డు ప్రయత్నంలో భాగంగా అహ్మదాబాద్‌లో సుమారు 1200 మంది దివ్యాంగులు ‘సైలెంట్‌ యోగా’ చేస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top