విలువైన విమానాలను మూలన పడేశారు..

Pilots Association Questions Sorry State Of Air India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ ఎయిర్‌ ఇండియా అధికారులకు భారత వాణిజ్య పైలట్ల సంఘం (ఐసీపీఏ) రాసిన లేఖ ఆలోచన రేకెత్తిస్తోంది. ఎయిర్‌లైన్స్‌ విమానాల నిర్వహణపై వారు ఆసక్తికర అంశాలను లేఖలో లేవనెత్తారు. సంస్థకు చెందిన ఎయిర్‌బస్‌ ఏ321 విమానాల్లో 40 శాతం విమానాలను గ్రౌండ్‌కే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. ఏ 319 ఎయిర్‌క్రాఫ్ట్‌ కీలక రూట్లలో అధిక సీటింగ్‌ సామర్ధ్యం ఉన్న క్రమంలో మెరుగైన ఆదాయ వనరుగా ఉన్నప్పటికీ వాటిలో చాలా వరకూ ఖాళీగా ఉంచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

రూ 25,000 కోట్ల విలువైన విమానాలను వాడకుండా పడేయడంతో ప్రతిరోజూ సంస్థకు భారీ నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.సంస్థకు చెందిన 22 ఎయిర్‌బస్‌ ఏ 319 విమానాలకు గాను నాలుగు విమానాలు రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా లేవని పేర్కొంది. ఇక 15 బోయింగ్‌ 777-300 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు గాను 5 విమానాలు హ్యాంగర్‌కే పరిమితమయ్యాయని తెలిపింది.

విడిభాగాల కొరతతో ఎయిర్‌ ఇండియా విమానాల్లో దాదాపు 23 శాతం విమానాలు ఆపరేషన్స్‌కు దూరంగా ఉన్నాయని పేర్కొంది. ఈ విమానాలు ఎందుకు ఇన్ని రోజులుగా గ్రౌండ్‌కే పరిమితమయ్యాయని మేనేజ్‌మెంట్‌ను పైలట్లు నిలదీశారు. ఖర్చును నియంత్రించుకోవడంలో యాజమాన్యం విఫలమైందా అని ప్రశ్నించారు. ఎయిర్‌ ఇండియా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో పైలట్లు రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఎయిర్‌ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకే ప్రభుత్వం దృష్టిసారించిందని, పూర్తిగా సంస్థను వదిలించుకోవాలనే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా పునరుద్ఘాటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top