
పెట్రోల్ బాంబు దాడిలో పూర్తిగా కాలిపోయిన కారును పరిశీలిస్తున్న మాజీ మంత్రి సెల్వగణపతి
సేలం: తమ పార్టీలో సభ్యత్వం చేర్పించే కార్యక్రమం డీఎంకేలో చిచ్చుపెట్టింది. సేలం జిల్లాలో ఆ పార్టీ నేతల్లో అంతర్గత సమరం జరుగుతున్న క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి సేలం రామ్‌నగర్‌లోని మాజీ మంత్రి సెల్వగణపతి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రో బాంబులు విసిరారు. దీంతో ఆయన ఇంటి ఆవరణలో ఉన్న ఒక బైకు, ఒక కారుకు మంటలు అంటుకున్నాయి. సేలం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే అవి పూర్తిగా కాలిపోయాయి.
ఆ సమయంలో సెల్వగణపతి కుమారుడు అరవింద్‌గణపతి, ఆయన కుటుంబీకులు మాత్రమే ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అస్తంపట్టి పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సేలంలో డీఎంకే మాజీ మంత్రి సెల్వగణపతి అరిసి పాళయం ప్రాంతంలో శుక్రవారం సభ్యులను చేర్పించే కార్యక్రమం నిర్వహించారు. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన సేలం సిటీ డీఎంకే కార్యదర్శి రాజేంద్రన్ మద్దతుదారులు కొందరు సెల్వగణపతితో వాగ్వాదానికి దిగారు. తమను అడగకుండా ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రెండు వర్గాలకు చెందిన ఇద్దరికి గాయాలు కావడంతో సేలం జీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పల్లపట్టి పోలీసులు ఇరు వర్గాలకు చెందిన ఎనిమిదిమందిపై కేసు నమోదు చేశారు. అనంతరం సెల్వగణపతి అక్కడి నుంచి చెన్నైకు వెళ్లారు.