పారా మిలటరీ సిబ్బంది లైవ్ లొకేషన్

న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న పారా మిలటరీ దళాల్లో రెండు కరోనా పాజిటవ్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంటి నుంచి పనిచేస్తున్న(వర్క్ ఫ్రం హోం), సెలవుల్లో ఉన్న పారా మిలటరీ దళాల సిబ్బంది వాట్సాప్ లైవ్ లోకేషన్ ద్వారా తమ జాడ తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) విభాగం ఉన్నతాధికారులకు ఈ బాధ్యతలు అప్పగించింది. సెలవులను, ఇంటి నుంచి పని చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా సంబంధిత పారా మిలటరీ సిబ్బంది వారి ఇళ్లలోనే ఉండేలా చూడడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని సెంట్రల్ అర్మ్‌డ్ పోలీసు ఫోర్స్(సీఏపీఎఫ్) కమాండర్ ఒకరు తెలిపారు.