
ముగిసిన పాంపోర్ ఎన్‌కౌంటర్
శ్రీనగర్, జమ్మూ జాతీయ రహదారిలో ఉన్న పంపోర్ ప్రాంతంలోని ఈడీఐ భవనంలో దాగిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: శ్రీనగర్, జమ్మూ జాతీయ రహదారిలో ఉన్న పంపోర్ ప్రాంతంలోని ఈడీఐ భవనంలో దాగిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దీంతో 56 గంటల సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌కు బుధవారం తెరపడింది. ఈడీఐ భవనంలో గాలింపు చర్యలు పూర్తయ్యాయని, ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమయ్యాయని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. సోమవారం ఉగ్రవాదులు ఈ భవనంలోకి చొరబడిన విషయం తెలిసిందే. ఆరోజు జరిగిన కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. అప్పటి నుంచి భద్రతా దళాలు చాకచక్యంగా వ్యవహరించాయి.
ఆ భవనంలో 60 గదులు ఉండటం వల్ల, ఒక్కో గదిని స్వాధీనం చేసుకోవాల్సి రావడం వల్ల ఎన్‌కౌంటర్‌కు ఎక్కువ సమయం పట్టిందని మేజర్ జనరల్ అశోక్ నౌరులా తెలిపారు. కాగా, ఉగ్రవాదులు ఈ భవనంలో చొరబడటం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. గతంలో ఫిబ్రవరి నెలలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు, ముగ్గురు ఉగ్రవాదులు, మరో పౌరుడు చనిపోయారు. కశ్మీరీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఇలాంటి భవంతిపై ఉగ్ర మూకలు తరచూ దాడి చేయడం బాధ కలిగిస్తోందని అశోక్ నౌరులా అన్నారు.