
అవార్డు గ్రహీతలతో రాష్ట్రపతి ప్రణబ్,ఉపరాష్ట్రపతి అన్సారీ,ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ తదితరులు
రాష్ట్రపతిభవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానం వైభవంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన 56 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పురస్కారాల్ని అందచేశారు.
56 మంది ప్రముఖులకు అందించిన రాష్ట్రపతి
పురస్కార గ్రహీతల్లో 8 మంది తెలుగువారు
న్యూఢిల్లీ: రాష్ట్రపతిభవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానం వైభవంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన 56 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పురస్కారాల్ని అందచేశారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు దివంగత ధీరుభాయ్ అంబానీ తరఫున ఆయన సతీమణి కోకిలాబెన్ పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. కుమారులు ముకేష్ అంబానీ, అనిల్ అంబానీలతో పాటు కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగువారైన ప్రముఖ కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి, అమెరికాకు చెందిన భారతీయ ఆర్థికవేత్త అవినాష్ కమలాకర్ దీక్షిత్, జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ జగ్‌మోహన్, శ్రీశ్రీ రవిశంకర్‌లు పద్మవిభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఆళ్ల వెంకట రామారావు, ప్రఖ్యాత వైద్యుడు డి. నాగేశ్వర్ రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో పాటు ప్రముఖ శిల్పి హఫీజ్ సొరబ్ కాంట్రాక్టర్, సంపాదకుడు బర్జీందర్ సింగ్ హమ్‌దర్ద్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, పారిశ్రామిక వేత్త పల్లోంజి షాపూర్జీ మిస్త్రీ, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్‌లు పద్మభూషణ్ అందుకున్నారు.
43 మందికి పద్మశ్రీ పురస్కారాలను బహూకరించారు. తెలుగువారైన ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు యార్లగడ్డ నాయుడమ్మ, సంఘసంస్కర్త టీవీ నారాయణ, గుండె వ్యాధి నిపుణుడు ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, చిత్రకారుడు కలాల్ లకా్ష్మగౌడ్‌లు రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీలు స్వీకరించారు. ఇస్రో శాటిలైట్ కేంద్ర డైరక్టర్ ఎం.అన్నాదురై, దర్శకుడు మధుర్ భండార్కర్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్‌పాల్ సింగ్, ప్రకృతి వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్, హర్మోనియం విద్వాంసుడు పండిట్ తులసీదాస్ బోర్కర్‌లు, ఆర్చర్ దీపికా కుమారి , జానపద గాయని మాలిని అశ్వతిలు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 112 మంది ప్రముఖులకు పద్మ అవార్డుల్ని ప్రకటించింది. వచ్చే నెలలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రజనీకాంత్, సానియా మీర్జా, ప్రియాంకాచోప్రా తదితరులకు పద్మ పురస్కారాలు బహూకరిస్తారు.
గ్యాస్ట్రో ఎంటరాలజీకి దక్కిన గౌరవం: డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి
పద్మభూషణ్‌ను తనకు గుర్తింపుగా కాకుండా గ్యాస్ట్రో ఎంటరాలజీకి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి చెప్పారు. దేశంలో పేద ప్రజలకే ఎక్కువ శాతం గ్యాస్ట్రో సంబంధిత సమస్యలు వస్తున్నాయని, అతి తక్కువ ఖర్చుతో వైద్యం కోసం పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. గ్యాస్ట్రిక్ జబ్బులపై సమగ్ర సర్వేను కేంద్ర ప్రభుత్వానికి అందించామని తెలిపారు.
యువత పరిశోధనపై దృష్టి పెట్టాలి: డాక్టర్ ఆళ్ల వెంకట రామారావు
దేశ యువత పరిశోధనా రంగంపై దృష్టి సారించాలని డాక్టర్ ఆళ్ల వెంకట రామారావు అన్నారు. అమెరికా కంటే భారత్‌లోనే తక్కువ ధర కు జనరిక్ మందులు దొరుకుతున్నాయని, పెరుగుతున్న పరిశోధనల వల్లే ఇది సాధ్యమవుతోందని చెప్పారు.