తెలుగు రాష్ట్రాలపై తీవ్ర వ్యతిరేకత

Orissa People Protest - Sakshi

భువనేశ్వర్‌/పూరీ : విశ్వ విఖ్యాత జగన్నాథుని సంస్కృతిపట్ల ఉభయ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు సమాచారంతో పాఠ్య పుస్తకాల్ని ప్రచురించాయి. ఈ రెండు ప్రభుత్వాలు నిర్వహిస్తున్న బీఈడీ పాఠ్యాంశాల్లో ఇటువంటి తప్పిదం చోటు చేసుకున్నట్లు రాష్ట్రం దృష్టికి వచ్చింది. ఈ చర్యపట్ల స్థానికంగా జగన్నాథుని సంస్కృతి, పరిశోధన వర్గాలు బుధవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

జగన్నాథ సేన ఆధ్వర్యంలో శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో బుధవారం భారీ నిరసన ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచురించిన పాఠ్య పుస్తకాల్లో జగన్నాథుని రథయాత్ర ఇస్కాన్‌ నిర్వహిస్తోందని ప్రచురితమైంది. అలాగే నవ కళేబరం, గుండిచా యాత్ర వంటి జగన్నాథ సంస్కృతి వ్యవహారాలను పూర్తిగా తప్పుడు సమాచారంతో పాఠ్య పుస్తకాల్ని ప్రచురించినట్లు ఆరోపణ. తక్షణమే ఈ పాఠ్యాంశాల్ని రద్దు చేసి రచయితలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు.

చర్యలకు ప్రభుత్వం సిద్ధం

జగన్నాథుని సంస్కృతి అప ప్రచారంపట్ల రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఈ వివాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మేరకు తక్షణ చర్యలు చేపడుతుందని ఆ విభాగం మంత్రి అనంత నారాయణ దాస్‌ ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టి బొమ్మలతో జగన్నాథుని ప్రధాన దేవస్థానం సింహద్వారం ఆవరణలో నిరసన ప్రదర్శించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top