
సీఎం సభలో వినూత్న ప్రయోగం
గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ హాజరైన సభలో పీఏఏఎస్ కార్యకర్తలు నిరసన తెలపకుండా నిర్వాహకులు వినూత్న ప్రయోగం చేశారు.
రాజ్కోట్: గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ హాజరైన సభలో పటీదార్ అనామత్ ఆందోళన సమితి(పీఏఏఎస్) కార్యకర్తలు నిరసన తెలపకుండా నిర్వాహకులు వినూత్న ప్రయోగం చేశారు. జాస్దాన్ తాలుకాలోని ఆట్కోట్ గ్రామంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి విజయ్ రూపానీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు 25 వేల మంది హాజరైయ్యారు. పటేల్ సామాజిక వర్గానికి పట్టున్న ప్రాంతం కావడంతో సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 25 మంది పీఏఏఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సభలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ కుర్చీలను ఒకదానితో ఒకటి తాళ్లతో కట్టేశారు.
ఇలా ఎందుకు కట్టారే అర్థంకాక సభకు హాజరైన వారు జుట్టుపీక్కున్నారు. పీఏఏఎస్ కార్యకర్తలు ఆందోళన చేయకుండా పోలీసులు ఇలా చేశారని తెలుసుకుని ముక్కుపై వేలేసుకున్నారు. అంతకుముందు సూరత్ లో విజయ్ రూపానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్న సభలో ప్లాస్టిక్ కుర్చీలను విసిరేసి పీఏఏఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో కుర్చీలను పోలీసులు తాళ్లతో కట్టేశారు. అంతేకాదు కుర్చీలు కూడా తక్కువగా వేశారు. ఎక్కువ మందిని కార్పెట్ మీద కూర్చొబెట్టారు.