పరువు హత్య కాదు..ఆత్మహత్యే!

Online Report on Love Couple Suicide Case Tamil Nadu - Sakshi

పరువు హత్య కాదు ఆన్‌లైన్‌లో నివేదిక

ఏడేళ్లకు ఇలవరసన్‌ కేసు కొలిక్కి

క్షమాపణ చెబుతారా.. రాందాసు డిమాండ్‌

సాక్షి, చెన్నై: ‘ఓ ప్రేమజంట కులాంతర వివాహం ఏడేళ్ల క్రితం మూడు గ్రామాల్ని కన్నీటి మడుగులో ముంచింది. వందలాది ఇళ్లు భష్మీపటలం అయ్యాయి. ఆ తదుపరి పరిణామాలతో ప్రియుడు రైలు పట్టాలపై శవంగా తేలడం రాష్ట్రంలో ఓ సామాజిక వర్గాన్ని ఆగ్రహానికి గురి చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక కమిషన్‌ను రంగంలోకి దించక తప్పలేదు. ఎట్టకేలకు ఈ కేసులో ప్రియుడి హత్య పరువు హత్య కానే కాదని, ఇది ఆత్మహత్య అని తేల్చుతూ ఆ కమిషన్‌ సమర్పించిన నివేదిక ఆదివారం ఓ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం అయింది. 

దర్మపురి జిల్లా చెల్లం కోట్టైకు చెందిన నాగరాజన్‌ కుమార్తె దివ్య (21), అదే జిల్లా నాయకన్‌ కోట్టై నత్తం కాలనికి చెందిన ఇళంగోవన్‌ కుమారుడు ఇలవరసన్‌ (23)ల ప్రేమ వివా హం ఏడేళ్ల క్రితం రాష్ట్రంలో పెద్ద వివాదానికి దారి తీసింది. కుమార్తె కులాంతర వివాహంతో నాగరాజన్‌ ఆత్మహత్య చేసుకోవడం రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ సామాజిక వర్గాలకు చెందిన రాజకీయ పార్టీలు సైతం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ సామాజికవర్గం ఆగ్రహానికి మరో సామాజిక వర్గానికి చెందిన మూడు గ్రామాలు కన్నీటి మడుగులో మునిగాయి. వందలాది ఇళ్లు భష్మీ పటలం అయ్యాయి. ఈ  వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. చివరకు ఇరు సామాజిక వర్గాలకు చెందిన పెద్దలు రంగంలోకి దిగి ఈ జంటను విడగొట్టే యత్నం చేశారు. తామిద్దరం కలసి జీవిస్తామని ఈ ప్రేమజంట తొలుత స్పష్టం చేసినా, చివరకు ఏమి జరిగిందో ఏమోగానీ దివ్య మాత్రం తన తల్లి వెన్నంటి వెళ్తున్నట్టుగా కోర్టులో ప్రకటించింది. దివ్య దూరం కావడంతో తీవ్ర మనోవేదనలో ఇలవరసన్‌ పడ్డాడు. దివ్య తన తల్లి వెంట వెళ్లిన కొద్ది రోజులకు ధర్మపురి ఆర్ట్స్‌ కళాశాల వెనుక ఉన్న రైల్వే ట్రాక్‌లో ఇలవరసన్‌ మృతదేహం బయట పడింది. పరువు హత్యే అంటూ దళిత సామాజిక వర్గానికి చెం దిన సంఘాలు, రాజకీయపార్టీలు మరో సా మాజిక వర్గంకు వ్యతిరేకంగా ఆగ్రహాన్ని ప్రదర్శించాయి. ధర్మపురి జిల్లానే కాదు, కృష్ణగిరి, సేలం జిల్లాల్లో సైతం పరిస్థితి ఉద్రిక్తంగా మా రే రీతిలో పరిణామాలు చోటు చేసుకున్నాయి.

రంగంలోకి సింగార వేలు కమిషన్‌..
ఈ కులాంతర ప్రేమ వివాహం, ప్రియుడి అనుమానాస్పద స్థితి వ్యవహారం చివరకు పీఎంకే, వీసీకేల మధ్య వివాదాన్ని రేపే పరిస్థితిని తీసుకొచ్చాయి. దీంతో విచారణ సీబీసీఐడీకి అప్పగించారు. ధర్మపురి కోర్టులో సీబీసీఐడీ చార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేసింది. ఇలవరసన్‌ ఆత్మహత్య చేసుకున్నట్టుగా చార్జ్‌షీట్‌లో తేల్చారు. దీనిని ఇలవరసన్‌ కుటుం బీకులు, దళిత సామాజిక వర్గానికి చెందిన పార్టీలు, సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో  ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు రిటైర్డ్‌ జడ్జి సింగార వేలు నేతృత్వంలో ప్రత్యేక కమి షన్‌ రంగంలోకి దిగింది. ఈ కమిషన్‌ కొన్నేళ్లుగా విచారణ సాగించి, సమగ్ర సమాచారాలు, ఆధారాలతో నివేదికను సిద్ధం చేసి, గత ఏడాది ఆగస్టులో సీఎం పళనిస్వామికి సమర్పించింది. అయితే, ఆ నివేదికలో ఏమున్నదో అన్నది బహిర్గతం కాలేదు. బయట పెట్టాల్సిందేనని దళిత సామాజిక వర్గానిక చెందిన సంఘాలు, పార్టీలు నినదిస్తూ వచ్చాయి. అయితే, ఆ నివేదిక బయటకు రాలేదు.

ఈ పరిస్థితుల్లో ఆదివారం ఈ నివేదిక ఓ వెబ్‌సైట్‌లో ప్రత్యేక్షం కావడం గమనార్హం. 1300 పేజీలతో తన నివేదికను సింగార వేలు సిద్ధం చేసి సమర్పించారు. వన్నియర్‌ సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గానికి చెందిన వారి వద్ద జరిపిన విచారణ, తటస్థంగా ఉన్న వ్యక్తుల వద్ద సాగించిన విచారణ, వాంగ్మూలం, సేకరించిన వివరాలు అందులో పొందు పరిచారు. ఇలవరసన్‌ మృతదేహం పడి ఉన్న చోట లభించిన ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక, వైద్యపరంగా సేకరించిన సమాచారాలు, అన్ని రకాల వివరాలను సేకరించి, వాటి ఆధారంగా ఇలవరసన్‌ ఆత్మహత్య చేసుకున్నట్టుగా నిర్ధారించి ఉండడం గమనార్హం. దివ్య దూరం కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉన్నట్టుగా నివేదికలో తేల్చి ఉన్నట్టుగా వివరాలు ఆ వెబ్‌ సైట్‌లో పేర్కొన బడి ఉంది.  ఇలవరసన్‌ మరణం ఆత్మహత్యే గానీ, పరువు హత్య కాదు అని ఆ కమిషన్‌ స్పష్టం చేసి ఉండడంతో, పీఎంకే నేత రాందాసు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విడుదల చేసిన ప్రకటనలో తమపై  నిందల్ని వేసే విధంగా గతంలో వ్యవహరించిన వాళ్లు, పరువు హత్య కాదని తేలడంతో ఇప్పుడు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమా అని సవాల్‌ చేయడం గమనార్హం.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top