
మన దేశంలో చదువుకోవాలంటే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రైళ్లలో ప్రయాణించి మరీ పాఠశాలకు వెళ్లిన విద్యార్థుల్ని చూశాం. కానీ రాజస్తాన్లోని అల్వార్‌లో విద్యార్థులు రైలెక్కి మరీ అక్షరాలు దిద్దుతున్నారు. సర్వశిక్షా అభియాన్‌లోని ఒక ఇంజనీర్ ఆలోచన ఆ పాఠశాల రూపురేఖలే మార్చేసింది. ప్రభుత్వ పాఠశాల భవనం కాస్తా రైలుగా మారిపోయింది. రైలు ఇంజిన్ ప్రిన్సిపాల్ గది, రైలు బోగీలే తరగతి గదులు, పిల్లలు ఆడుకునే మైదానం రైల్వే ప్లాట్‌ఫామ్‌గా కనిపిస్తుంది. కాంపౌండ్ వాల్‌ని గూడ్స్ రైలుగా మార్చి వాటిపై స్ఫూర్తిదాయక కొటేషన్లు రాశారు.
ఇన్ని హంగులు ఎందుకు చేశారన్న సందేహాలు ఎందుకంటే.. అన్ని రాష్ట్రాల్లోలాగే రాజస్తాన్‌లోనూ ఎవరూ సర్కారీ బడివైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. అందుకే విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఇలాంటి సరికొత్త ఆలోచన చేశారు. పిల్లల్లో రైలు బండిపై చాలా కుతూహలం ఉంటుంది. రైలెక్కడం అంటే ఎగిరి గంతేస్తారు. అందుకే ఈ సర్కారీ బడి కాస్తా రైలు బండిగా మారిపోయింది. ఇలా మారాక విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాఠశాల సిబ్బందిలోనూ ఉత్సాహం పెరిగింది. కొన్ని తరగతి గదులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రిన్సిపాల్ పురుషోత్తం గుప్తా చెప్పారు. పిల్లలైతే చుక్ చుక్ రైలు వచ్చింది.. చదువులను మోసుకొచ్చిందంటూ చదువుకుంటున్నారు.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్