చార్జీలు వసూలు చేయకండి

No fare to be charged from migrant workers returning home - Sakshi

కార్మికుల తరలింపుపై  సుప్రీంకోర్టు ఆదేశం

రవాణా, ఆహారం, వసతి కల్పన ప్రభుత్వాల బాధ్యత

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల నుంచి రైళ్లలోగానీ, బస్సుల్లోగానీ చార్జీలు వసూలు చేయరాదని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కార్మికుల ప్రయాణానికి వారి వంతు వచ్చే వరకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. రైల్వే స్టేషన్లలో రాష్ట్రాలు వలస కార్మికులకు ఆహారం, నీరు అందించాలనీ, రైళ్లలో రైల్వే శాఖ భోజనం, మంచినీరు సరఫరా చేయాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

వేలాది మంది వలస కార్మికులు అష్టకష్టాలు పడుతూ రోడ్లపై నడిచి వెళ్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం.. వలస కార్మికుల సమస్యను మే 26న సుమోటోగా స్వీకరించి, గురువారం విచారణ చేపట్టింది. కాలినడకన వెళుతోన్న వలస కార్మికులకు రవాణా సదుపాయాలను కల్పించాల్సిందిగా రాష్ట్రాలను కోరాలంటూ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన సూచనలను కోర్టు గుర్తించింది. వలస కార్మికులు ఎందరున్నారు, వారి తరలింపు, వారి రిజిస్ట్రేషన్‌ విధానం తదితర పూర్తి సమాచారం రికార్డు చేయాలని సూచించింది. పేరు నమోదు చేసుకున్న తర్వాత వారిని ఎన్ని రోజులకు సొంత రాష్ట్రాలకు చేరుస్తామనే విషయంలో నిర్దిష్టత ఉండాలంది. తదుపరి విచారణను జూన్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటిదాకా 3,700 రైళ్లలో వలస కార్మికులను స్వరాష్ట్రాలకు చేర్చినట్టు సొలిసిటర్‌ జనరల్‌ మెహతా తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top