వైద్య విద్యకు చికిత్స చేయమంటే ఇలా చేస్తారా? | NITI Aayog Guidelines for medical education | Sakshi
Sakshi News home page

వైద్య విద్యకు చికిత్స చేయమంటే ఇలా చేస్తారా?

Aug 18 2016 8:09 PM | Updated on Oct 9 2018 7:39 PM

భారతదేశం 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరపుకున్న రోజుల్లో కూడా దేశంలో కోట్లాది మంది పేదలకు వైద్యం అందక అకాల మృత్యువాత పడుతున్నారు.

న్యూఢిల్లీ : భారతదేశం 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరపుకున్న రోజుల్లో కూడా దేశంలో కోట్లాది మంది పేదలకు వైద్యం అందక అకాల మృత్యువాత పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రులు లేకపోవడమే కాకుండా వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా పట్టణాల్లో, పల్లెల్లో వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడమే కాకుండా పల్లెల వైపు చూసేందుకు కూడా వైద్యులు ఇష్టపడడం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఈ సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు దేశంలో ప్రైవేటు వైద్య విద్యను ప్రోత్సహించడం ఒక్కటే పరిష్కారమార్గమని స్వయంగా దేశ ప్రధాన మంత్రి చైర్మన్‌గా కొనసాగుతున్న ‘నీతి ఆయోగ్’ కమిటీ కేంద్రానికి సిఫార్సులు చేసింది. కార్పొరేట్ ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి తరుణంలో ప్రైవేటులో వైద్య విద్యను మరింత ప్రోత్సహించినట్లయితే ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో సులభంగానే ఊహించవచ్చు.
 
పైగా ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఫీజులను కూడా చట్టం ద్వారా నియంత్రించవద్దని, మార్గదర్శకాలు రూపొందిస్తే సరిపోతుందని నీతి ఆయోగ్ తన నివేదికలో సిఫార్సు చేసింది. ఫీజులను చట్టపరంగా నియంత్రించడం వల్ల చట్ట వ్యతిరేకంగా ఫీజులు తీసుకుంటారని, ట్రస్టీలు, సొసైటీల కింద ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతించినప్పటికీ ప్రస్తుతం అనేక ప్రైవేటు ఆస్పత్రులు లాభాలు గడించడం లేదా? ప్రైవేటు వైద్య కళాశాలలు, ప్రైవేటు ఆస్పత్రులకు లాభాలను  చట్టపరం చేస్తే తప్పేమిటని నీతి ఆయోగ్ ప్రశ్నిస్తోంది. ఈ తర్కంలో అంతరార్థం ఏమిటో నీతి ఆయోగ్‌కే తెలియాలి.
 
ఇప్పటికే సీటు కోసం కోటి రూపాయలను వసులు చేస్తున్న ప్రైవేట్ కాలేజీలకు ఫీజు విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తే ఆ ఫీజులు ఎన్ని కోట్ల రూపాయలకు పెరుగుతాయో అంచనా వేయవచ్చు. కోట్ల రూపాయల ఫీజులను కుమ్మరించి వైద్య విద్యను అభ్యసించే డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని ఎలా అనుకుంటున్నారో! ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదువుతున్న వారే కాసుల కోసం కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేయడానికి ప్రాధాన్యమిస్తున్న నేటి సమాజంలో వైద్య విద్య కాసులకు అమ్ముడుపోతే కానరాని పరిణామాలెన్నో. కార్పొరేట్ ఆస్పత్రులే వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తాయి. అవే రెండు రకాలు లాభాలు గుంజుకుంటాయి. శవాలకు వైద్య చికిత్స అందిస్తూ బిల్లులు గుంజుతున్న ప్రైవేటు ఆస్పత్రులున్న నేటి పరిస్థితుల్లో పల్లెల్లో ఆస్పత్రులు నడిపే దాతలు ఎవరుంటారు. నీతి ఆయోగ్ సిఫార్లులను అమలు చేయడం అంటే నిలువు దోపిడీకి లైసెన్స్ మంజూరు చేయడమేనని మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి సుజాతా రావు, పంజాబ్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ జీఎస్. గ్రెవాల్ లాంటి వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
కొన్ని నెలలపాటు పార్లమెంట్ స్థాయి సంఘం కష్టపడి కసరత్తు చేసి తయారు చేసిన మార్గదర్శకాలను నీతి ఆయోగ్ ప్యానెల్ బుట్టదాఖలు చేసింది. వైద్య రంగంలో అవినీతిని అరికట్టడంలో భారత వైద్య మండలి విఫలమైన నేపథ్యంలో పార్లమెంట్ స్థాయి సంఘం గత మార్చిలో వైద్య విద్యా విధానంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మే నెలలో ఉన్నత స్థాయి కమిటీని వేసి సమస్యలను పరిష్కరించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించిన నేపథ్యంలోనే ఈ నీతి ఆయోగ్ ప్యానెల్ ఆవిర్భవించింది. పేరులోని నీతిని పెట్టుకున్న ప్యానెల్ కార్పొరేట్ ఆస్పత్రుల అవినీతికి అమ్ముడు పోలేదా ? అన్న అనుమానాలు ప్రజల్లో కలగుతున్నాయి. 1980 దశకంలో కేంద్రం దేశంలో ప్రైవేటు ఆస్పత్రులకు తలుపులు తెరవడాన్ని విద్యావంతులు, నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement