నిత్యానంద దేశానికి ప్రధానిగా తమిళనటి?

NIthyananda May Announce PM For Kailasa Port - Sakshi

సాక్షి, చెన్నై: నిత్యానంద దేశానికి తమిళనటి ప్రధానమంత్రి కానుంది అనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. ఇప్పుడు కలకలం సృష్టిస్తున్న పేరు నిత్యానంద. ఇప్పుడే కాదు చాలా కాలం నుంచే ఈ పేరు వివాదాల్లో ఉంది. అయితే మధ్యలో కాస్త మరుగున పడింది. తాజాగా పిల్లల కిడ్నాప్‌ కేసులో పోలీసులకు వాంటెడ్‌ వ్యక్తిగా మారాడు. ఆధ్యాత్మక గురువుగా, బోధకుడిగా చెలామణీ అయిన నిత్యానంద పలు చోట్ల ఆశ్రమాలను నడుపుతూ పలువురు భక్తులను ఆకర్షించాడు. ముఖ్యంగా విదేశీయులను వశపరచుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచాడు. అలా కోట్లాది రూపాయలను కూడబెట్టాడు. అయితే అంతేలా లైంగిక, అత్యాచార ఆరోపణల్లోనూ వాసికెక్కాడు. కొంత కాలం జైలు జీవితాన్ని గడిపిన నిత్యానంద ఇప్పుడు పరారీలో ఉన్నాడు. కాగా ఈయనకు ప్రధాన శిష్యురాలుగా ఒక తమిళ నటి చేరి చాలా కాలమైంది. నిజానికి ఆమె తెలుగు అమ్మాయినే, తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది, నిత్యానందతో ఈమె సంబంధాల గురించి ఆ మధ్య చాలా రచ్చ జరిగింది. అయితే ఈ మూడక్షరాల నటి నిత్యానంద సేవలోనే తరుస్తూ వస్తోంది. అందుకు ఫలం ఇప్పుడు లభించనుందనే ప్రచారం జోరందుకుంది.

ఆ నటికి ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి యోగం పట్టుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఆధ్యాత్మికస్వామిగా తనను తాను ప్రచారం చేసుకున్న నిత్యానంద తాజాగా పిల్లల కిడ్నాప్‌ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంకెళ్లు వేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే నిత్యానంద అంత సులభంగా పట్టుపడతాడా? అలాగైతే తను నిత్యానంద ఎలా అవుతాడు? గుట్టు చప్పుడు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. అయితే తను దేశం విడిచి పారిపోయాడనే ప్రచారం జోరందుకుంది. అంతే కాదు చాలా సంచలన విషయాలు ఆయన గురించి ప్రచారం అవుతున్నాయి. నిత్యానంద దక్షిణ అమెరికా దేశం సమీపంలో ఉన్న ఒక దీవిని సొంతంగా కొనేశాడని, తను 30 మంది శిష్యగణంలో అక్కడే నివశిస్తున్నాడనీ ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఆ దీవిని ప్రత్యేక దేశంగా ప్రకటించుకుని,దానికి కైలాసదేశం అనే పేరును కూడా పెట్టుకున్నట్లు ప్రచారంలో ఉంది. అక్కడికి నిత్యానంద టన్నుల కొద్దీ బంగారాన్ని తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు తన దేశం కోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించకున్నాడట.

కైలాస దేశాని కంటూ ప్రత్యేకంగా జెండాను, సెపరేట్‌గా పాస్‌పోర్టు, వీసా వంటి వాటిని ఏర్పాటు చేసుకోనున్నారని ప్రచారంలో ఉంది. అంతే కాకుండా తన దేశాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితికి విన్పపం పెట్టుకోనున్నట్లు ఆయన వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. అదే విధంగా తన దేశానికి హిందూ అనే అర్హత చాలని ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఆ కైలాసదేశానికి అధిపతిగా రాజ్యాంగాన్ని రూపొందించుకుంటున్నట్లు, ఇప్పుడు ఆ దేశానికి తనకు అత్యంత సన్నిహితురాలైన తమిళ నటిని ప్రధానమంత్రిని చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా ఆ నటి త్వరలో కైలాసదేశానికి ప్రధానమంత్రి కాబోతోంది లాంటి ప్రచారం వైరల్‌ అవుతోంది. కాగా ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం నిత్యానంద విదేశాలకు పారిపోలేదని,  ఇండియాలోనే ఉన్నాడని, త్వరలోనే అతన్ని అరెస్ట్‌ చేస్తామని అంటున్నారు. ఏది నిజమో, ఏది వదంతో ?తెలియదు గానీ, నిత్యానంద గొడవ మాత్రం మరో సారి మీడియాలో రోజుకో కథనంతో ప్రధాన శీర్శికల్లో హల్‌చల్‌ చేస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top