వజ్రంతో గుండె కోశావ్‌ మోదీ..

Nirav Modi Cheated Canada Young Man - Sakshi

ప్రేయసితో తన బంధం వజ్రంలా ఎప్పటికీ నిలిచిపోవాలనుకున్నాడు  కెనడా యువకుడు పౌల్‌ అల్ఫాన్సో.  వజ్రపుటుంగరాన్ని ఆమె వేలికి తొడిగి తమ బంధానికి కొత్త కాంతులు అద్దాలని కలలు కన్నాడు. ఆ కలలు కల్లలయ్యాయి. విలన్‌ ఆమె తండ్రి కాదు.. నీరవ్‌ మోదీ! ‘వజ్రం’తో సుతి మెత్తగా అతడి గుండె కోశాడు ఆ ఘరానా మోసగాడు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు ఎగేసి, దేశం విడిచి పారిపోయిన ఆ ఆర్థిక నేరగాడు.. పౌల్‌కు నకిలీ వజ్రపుటుంగరాలు అంటగట్టాడట. దీంతో గాళ్‌ ఫ్రెండ్‌ అతడికి బ్రేకప్‌ చెప్పేసిందట!

ఇంతకీ ఈ ప్రేమికుడికి మోదీ ఎక్కడ తగిలాడు?
పౌల్‌ ఓ  పేమెంట్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌. 2012లో – బెవిర్లీ హిల్స్‌ హోటల్‌ వందేళ్ల పండగ వేళ మోదీని మొదటిసారి కలిశాడు. కొద్ది మాసాల తర్వాత మలిబులో ఇద్దరూ కలసి డిన్నర్‌ కూడా చేశారు. మోదీ మాటలు పౌల్‌ను  ఉత్సాహపరిచాయట. అతడిలో ఈ యువకుడు ఓ అన్నయ్యను కూడా చూశాడట. ఈ నేపథ్యంలో  2018 ఏప్రిల్‌లో మోదీకి  పౌల్‌ మెయిల్‌ చేశాడు. తన గాళ్‌ ఫ్రెండ్‌కి ప్రపోజ్‌ చేయబోతున్నానని,  లక్ష డాలర్ల విలువైన ‘ప్రత్యేక’ ఎంగేజ్‌మెంట్‌ ఉంగరాన్ని తయారు చేసివ్వాలని కోరాడు. ఇంతలో ఆయన  గాళ్‌ ఫ్రెండ్‌ మరో ఉంగరంపై ముచ్చటపడింది.  పౌల్‌ దాన్ని కూడా ఆర్డర్‌ చేశాడు. హాంగ్‌కాంగ్‌ షోరూమ్‌లో రెండు ఉంగరాల కోసం  మొత్తం రెండు లక్షల డాలర్లు చెల్లించాడు.  జూన్‌లో మోదీ సహాయకుడు అరీ నుంచి ఉంగరాలు అందుకున్న ఆ ప్రేమికుడు.. వాటిని చూసుకుని పరవశించిపోయాడు.  ప్రేయసికి వజ్రపుటుంగరాలు సమర్పించుకుని తన ప్రేమను మరోసారి ప్రకటించుకున్నాడు. పెళ్లి ప్రతిపాదనకు ఆమె అంగీకరించింది. ఇద్దరూ కలసి  ఉంగరాలకు బీమా చేయించాలనుకున్నారు. కానీ మోదీ ఉంగరాల తాలూకూ పత్రాలు పంపలేదు. దీంతో పౌల్‌ ఆయనకు పలుమార్లు ఈమెయిల్‌ పెట్టాడు. ఎప్పటికప్పుడు అవి దారిలో వున్నాయంటూ మోదీ నమ్మబలికాడు.

ఇంతలో ఆయన గాళ్‌ఫ్రెండ్‌ ఉంగరాలను పరీక్ష చేయించింది. అవి నకిలీవని తేలడంతో.. పౌల్‌ నమ్మలేకపోయాడు. అలా జరగడానికి వీల్లేదంటే వీల్లేదన్నాడు. మోదీ ఆర్థిక మోసాల గురించిన వార్తలు చదివాక, తాను మోసపోయానని గ్రహించాడు ఆ యువకుడు. ఇలాంటి భారీ లావాదేవీలు చేసేటప్పుడు పౌల్‌ చాలా  జాగ్రత్తగా వుంటాడట. కానీ దేశాలనే ముంచేసే నేరగాడికి పౌల్‌ను బోల్తా కొట్టించడం ఒక లెక్కా?

ఇది జరిగాక, పౌల్‌ గాళ్‌ఫ్రెండ్‌ ఆయనకు బ్రేకప్‌ చెప్పింది.  తన మనసంతా ఆక్రమించేసిన ప్రేయసి గుడ్‌బై చెప్పడంతో అతడు పని కూడా చేయలేకపోతున్నాడు. తాను తీవ్రమైన డిప్రెషన్‌లో కూరుకుపోయానని చెబుతున్న ఈ యువకుడు.. మోదీపై కాలిఫోర్నియా అత్యున్నత న్యాయస్థానంలో దావా వేశాడు. తన మనసును ముక్కలు చేసినందుకు 3 మిలియన్‌ డాలర్లు చెల్లించాలంటున్నాడు.  మొత్తం 4.2 మిలియన్‌ డాలర్ల పరిహారాన్ని డిమాండ్‌ చేస్తున్నాడు. ‘నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావ్‌’ అంటూ మోదీకి తీవ్ర పదజాలంతో మెయిల్‌ కూడా పెట్టాడట ఈ భగ్న ప్రేమికుడు. పాపం పౌల్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top