చైనా సైనికులతో ముచ్చటించిన నిర్మలా

Namaste, Ni Hao: Nirmala Sitharaman Meets Chinese Troops At Sikkim Border

న్యూఢిల్లీ : ‘నమస్తే’ అంటే అర్థం మీకు తెలుసా? అంటూ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చైనా సైనికులను ప్రశ్నించారు. శనివారం సిక్కిం సరిహద్దులో గల నాథులాలో ఆమె పర్యటించారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) సైనికులతో నిర్మలా మచ్చటించిన వీడియోను రక్షణ శాఖ ట్వీటర్‌లో పోస్టు చేసింది. చైనా అధికారులను పరిచయం చేసుకునే క్రమంలో వారికి చేతులు జోడించి నమస్కరించారు హోం మంత్రి.

మీకు నమస్తే అంటే ఏంటో తెలుసా? అని వారిని ప్రశ్నించారు. గ్రీటింగ్స్‌ అని భారత సైనికులు చెప్పబోగా.. వారిని వారించి చైనా సైనికులను చెప్పాలని కోరారు. అనంతరం చైనీస్‌ భాష(మాండరిన్‌)లో ‘నమస్తే’ పదానికి అర్థం(నిహో) ఏంటని వారిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సైనికులు, మంత్రి పరస్పరం ‘నమస్తే’ చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు మంత్రికి మధ్య ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించిన సైనికాధికారిని నిర్మలా అభినందించారు.

తన పేరు వాంగ్‌ అని చెప్పుకొచ్చిన సైనికాధికారి, తమ భాషలో వాంగ్‌ అంటే ‘రాజు’ అని అర్థం అని చెప్పారు. అందుకు స్పందించిన నిర్మలా సో మనకు ట్రాన్స్‌లేటర్‌గా కింగ్‌ ఇక్కడ ఉన్నారన్నమాట అని చమత్కరించారు. డోక్లాంలో చైనా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఇటీవల ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం చైనా డోక్లామ్‌ నుంచి సైనికులను ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలిపింది.

అయితే, డోక్లామ్‌కు 10 కి.మీ. దూరంలోని చుంబీ వ్యాలీలో చైనా మళ్లీ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో.. చైనా సరిహద్దుల్లో రక్షణ మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top