‘ఓటీపీ అడిగితే.. అభినందన్‌ డైలాగ్‌ చెప్పండి’

Nagpur Police Uses Abhinandan Dialogue To OTP Frauds - Sakshi

నాగ్‌పూర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ సిటీ పోలీసులు ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి వినూత్నంగా ఆలోచించారు. ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కల్పించడానికి భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ చెప్పిన డైలాగ్‌తో ప్రచారం చేశారు. శత్రు చెరలో బందీగా ఉండి కూడా దైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్‌ను చూసి దేశం మొత్తం గర్వించిన సంగతి తెలిసిందే. మాతృ దేశంపై దాడికి ప్రయత్నించిన పాకిస్తాన్‌ యుద్ధ విమానాలను తిప్పికొడుతున్న క్రమంలో ఆయన విమానం పాక్‌ భూభాగంలో కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఆయన.. పాక్‌ సైన్యం చేతికి చిక్కారు. ఆ తర్వాత ఆయన్ని బందీగా చేసుకుని పాక్‌ సైన్యం నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది. దాయాది దేశం ఎన్ని చిత్ర హింసలు పెట్టిన ఆయన వాటికి తట్టుకుని నిలబడ్డారు.

పాక్‌ సైనిక అదికారులు అభినందన్‌ను విచారిస్తున్న సమయంలో తన మిషన్‌ గురించి వివరాలు రాబట్టడానికి ఎంతగానో ప్రయత్నించారు. వారు ఎంతగా ప్రయత్నించిన అభినందన్‌ మాత్రం ‘అవన్నీ నేను మీకు చెప్పకూడదు(I am not supposed to tell you this)’ అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే వ్యక్తిగత వివరాలు అడిగినప్పుడు కూడా తాను శత్రు దేశం చెరలో ఉన్నానని భయపడకుండా, ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా సమాధానం దాటవేసి దేశభక్తిని చాటుకున్నారు. అయితే అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాక్‌.. అభినందన్‌ను  రోజున భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.

అయితే నాగ్‌పూర్‌ పోలీసులు ‘ఓటీపీ’లతో జరుగుతున్న మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అభినందన్‌ చెప్పిన మాటలను ఉపయోగించారు. దుండగులు బ్యాంకుల పేరుతో నకిలీ ఫోన్‌ కాల్స్‌ చేసి వినియోగదారుల నుంచి ఓటీపీలను సేకరించి వారి ఖాతాల నుంచి డబ్బును దోచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఇటువంటి మోసాలు అధికంగా జరుగుతుండటంతో.. ఇకపై ఎవరైనా ఫోన్‌ చేసి ఓటీపీ అడిగితే.. అభినందన్‌ చెప్పినట్టు ఈ వివరాలు నేను మీకు చెప్పకూడదనే సమాధానం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ మేరకు నాగ్‌పూర్‌ పోలీసుల చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. పోలీసులు ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top