
‘స్కూల్‌కి పంపించండి నాన్న.. పెళ్లి వద్దు’
ఆ బాలిక చదివింది ఏడో తరగతి మాత్రమే. జూన్ 12న ఎనిమిదొ తరగతి విద్యాభ్యాసాన్ని ప్రారంభించనుంది. అంతలోనే పిడుగులాంటి వార్త తల్లిదండ్రులు చెప్పారు.
లక్నో: ఆ బాలిక చదివింది ఏడో తరగతి మాత్రమే. జూన్ 12న ఎనిమిదొ తరగతి విద్యాభ్యాసాన్ని ప్రారంభించనుంది. అంతలోనే పిడుగులాంటి వార్త తల్లిదండ్రులు చెప్పారు. పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని ఆమెకు పెళ్లి చేస్తున్నామని, అది కూడా జూన్ 12నే పెళ్లి అంటూ షాకిచ్చారు. దీంతో అప్పటి వరకు స్కూల్‌కు వెళతానని భావించిన ఆ బాలిక భయంతో వణికిపోయింది. తాను స్కూల్‌కే వెళతానంటూ, పెళ్లి వద్దంటూ పగవారిని బ్రతిమిలాడుకున్నట్లుగా వేడుకుంది. వారు కనికరించకపోగా పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారు. పైగా మానసికంగా, శారీరకంగా హింసించారు.
ఆత్మహత్య చేసుకుంటానని బాలిక బెదిరించినా వినలేదు. దీంతో జూన్ పది వరకు తనకు తోచిన రూపంలో ఆందోళనను తెలియజేసిన ఆ బాలిక ఇక చేసేది లేక ఇంట్లో నుంచి రెండు రోజులపాటు పారిపోయింది. పెళ్లి అయిపోయాక వచ్చింది. దీంతో తమ పరువు తీశావంటూ తమ కూతురుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాగా కొట్టి ఇంట్లోనుంచి తరిమేశారు. దీంతో ప్రాణరక్షణతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. ‘నాకు పెళ్లి తేది ఖరారు చేసినప్పటి నుంచి మా అమ్మనాన్నలను బ్రతిమాలుకుంటున్నాను. ఎవరూ నా మాట వినడం లేదు. జూన్ 10 వరకు అలాగే చేశా. బెదిరించారు. మానసికంగా హింసించారు. వారి నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు నరకం చూపించారు’ అని పోలీసులకు చెప్పింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలికది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలోని ఓ గ్రామం. ఈ బాలికను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన యువకుడు మహోబా జిల్లాలోని ఖన్నా అనే గ్రామానికి చెందిన కర్హరియా. తొలుత పోలీసులు పిలిపించినా బాలికను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు రాకపోవడంతో బాల్య వివాహం జరిపించే ప్రయత్నం చేసిన నేరం కింద అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు.