మామిడి అ‘ధర’హో! | Sakshi
Sakshi News home page

మామిడి అ‘ధర’హో!

Published Wed, Apr 16 2014 4:26 AM

మామిడి అ‘ధర’హో! - Sakshi

న్యూఢిల్లీ: మామిడి ధరలు ఈ ఏడాది చుక్కలు చూపే అవకాశం ఉందని ‘అసోచామ్’ అధ్యయనంలో వెల్లడైంది. నోరూరించే మన మామిడికి విదేశాల నుంచి భారీగా డిమాండ్ ఉండటం, అందుకు తగినట్లుగా దిగుబడి లేకపోవటమే దీనికి కారణం. గత నెలలో అకాల వర్షాల కారణంగా మామిడి తోటలు దెబ్బ తినటంతో దేశంలో దిగుబడి ఈ ఏడాది 20 శాతం తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో మార్చిలో కురిసిన అకాల వర్షాలతో 50 శాతానికిపైగా మామిడి తోటలు దెబ్బ తిన్నాయి. 

దేశంలో మామిడి దిగుబడిలో 2/3 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే వస్తోంది.  దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మామిడిలో సగం ఆంధ్రప్రదేశ్, యూపీ నుంచే వస్తోంది.  గత మూడేళ్లలో విదేశాలకు మామిడి ఎగుమతులు 27 శాతం పెరిగాయి. 2012-13లో రూ.267 కోట్ల విలువైన మామిడి ఎగుమతులు జరిగాయి. దేశీయ మార్కెట్‌లో మామిడి ధరల పెరుగుదలకు ఇది ప్రధాన కారణం.  భారత్ నుంచి అత్యధికంగా యూఏఈకి 61 శాతం మామిడి ఎగుమతి అవుతోంది. బ్రిటన్, సౌదీ అరేబియా తరువాత స్థానాల్లో నిలిచాయి.   ప్రపంచవ్యాప్తంగా 1,300కిపైగా మామిడి రకాలున్నాయి. ఒక్క భారత్‌లోనే 1,000కిపైగా రకాలను సాగు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement