సరిహద్దులో యుద్ధమేఘాలు: సీఈసీ కీలక వ్యాఖ్యలు | Lok Sabha Polls Will be Held on Time says CEC Sunil Arora Amid India Pak Tensions | Sakshi
Sakshi News home page

సరిహద్దులో యుద్ధమేఘాలు: సీఈసీ కీలక వ్యాఖ్యలు

Mar 1 2019 6:02 PM | Updated on Mar 1 2019 6:13 PM

Lok Sabha Polls Will be Held on Time says CEC Sunil Arora Amid India Pak Tensions - Sakshi

భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సార్వత్రిక ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉండొచ్చంటూ వస్తున్న వార్తలపై సీఈసీ స్పందించారు.

లక్నో: భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సార్వత్రిక ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉండొచ్చంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. దేశంలో ఎన్నికలు సకాలంలో నిర్వహిస్తామని, వాయిదా వేసే ఆలోచనే లేదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన సునీల్ అరోరా శుక్రవారం లక్నోలో అక్కడి అధికారులతో సమీక్ష సందర్భంగా మాట్లాడారు.

ఎన్నికల నిబంధనల్లో కొత్తగా కొన్ని మార్పులను ప్రతిపాదించామని సునీల్ అరోరా చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విదేశాల్లో ఉన్న ఆస్తులను కూడా చూపాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఇచ్చే ఆస్తుల వివరాలపై ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తుందని, తేడాలు వస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆస్తుల వివరాలన్నింటినీ తాము అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరుస్తామని, ఆదాయపు పన్ను శాఖ సుమోటోగా ఆస్తుల వివరాలను పరిశీలిస్తుందని తెలిపారు. దీనికోసం తమ అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా రాదని చెప్పారు.

త్వరలో తాము సీ-విజిల్ యాప్ ను అందుబాటులోకి తీసుకుని రానున్నామని, దీనిద్వారా అభ్యర్థులపై ప్రజలు స్వచ్ఛందంగా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఫిర్యాదిదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా, విధ్వేషపూరితమైన ప్రసంగాలపై నిఘా ఉంటుందని సునీల్ అరోరా చెప్పారు. గత ఎన్నికల ప్రచారంలో కొన్ని కేసులను నమోదు చేశామని గుర్తుచేశారు. ఇలాంటి ప్రసంగాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని అన్నారు. తమ దృష్టికి వచ్చిన విధ్వేష పూరిత ప్రసంగాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీల పరిశీలనకు పంపిస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారంపై దృష్టి పెడతామని చెప్పారు. పెయిడ్ ఆర్టికల్స్ లపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement