‘ఓబీసీ కమిషన్‌’కు రాజ్యాంగ హోదా!

Lok Sabha passes amendment bill on OBC Commission - Sakshi

సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌(ఎన్‌సీబీసీ)కి రాజ్యాంగబద్ధత కల్పించే కీలక బిల్లును లోక్‌సభ ఆమోదించింది. గురువారం∙చర్చ తర్వాత మూడింట రెండింతలకు పైగా సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. రాజ్యసభ ప్రతిపాదించిన కొన్ని సవరణలను లోక్‌సభ తోసిపుచ్చింది. బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందేందుకు కృషిచేసిన సామాజిక న్యాయం, సాధికారత మంత్రి గెహ్లాట్‌ను ప్రధాని అభినందించారు. 123వ రాజ్యాంగ సవరణ పేరిట తెచ్చిన తాజా బిల్లుపై చర్చ సందర్భంగా ఓబీసీల సంఖ్యను తేల్చడానికి జనాభా లెక్కలు నిర్వహించాలని పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు. 2014 నాటి సామాజిక, ఆర్థిక సర్వే వివరాలను బహిర్గతం చేయాలని మరికొందరు కోరారు. ఎన్‌సీబీసీ సభ్యుల్లో ఒకరు మహిళ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.

సొంత ఓబీసీ జాబితా రూపొందించుకుని, దానిలో ఏ కులాన్నైనా చేర్చుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని చెప్పారు. కేంద్ర జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చాలనుకుంటే కేంద్రాన్ని సంప్రదించాలని గెహ్లాట్‌ సూచించారు. ఈ బిల్లుకు గతేడాది ఏప్రిల్‌ 10న లోక్‌సభ ఆమోదం తెలిపి రాజ్యసభకు పంపింది. ప్రతిపక్షాలు సూచించిన కొన్ని సవరణలను చేర్చి అదే ఏడాది జూలై 31న ఆమోదించిన బిల్లును ఎగువ సభ మళ్లీ లోక్‌సభకు పంపింది. ఆ సవరణలను తోసిపుచ్చుతూ తాజాగా లోక్‌సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్, జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ల మాదిరిగా ఎన్‌సీబీసీకి రాజ్యాంగబద్ధత కల్పించాలని  ప్రతిపాదించారు. బీసీలకు రాజ్యాంగం కల్పించిన రక్షణల అమలును ఎన్‌సీబీసీ చూస్తుంది. హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదుల విచారణ సమయంలో సివిల్‌ కోర్టులకుండే అధికారాలుంటాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top