వాజ్‌పేయికి ప్రముఖుల నివాళి

Last rites of  former PM Atal Bihari Vajpayee - Sakshi

న్యూఢిల్లీ: అనారోగ్యంతో కన్నుమూసిన భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మూత్రపిండ నాళాల ఇన్ఫెక్షన్‌, మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌, ఛాతీ సంబంధిత సమస్యతో గత కొన్ని రోజులు ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన గురువారం కన్నుమూశారు.  దీంతో ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీలోని కృష్ణమీనన్‌ మార్గ్‌కు తరలించారు. కృష్ణ మీనన్‌ మార్గ్‌లోని నివాసంలో వాజ్‌పేయిని కడసారి చూసేందుకు హాజరైన పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

కృష్ణ మీనన్‌ మార్గ్‌లోని నివాసంలో వాజ్‌పేయి పార్థివదేహానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు బీజేపీ కురు వృద్ధుడు ఎల్‌ కే అద్వానీ, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్‌ నరసింహన్‌, కేరళ, తమిళనాడు గవర్నర్లు సదాశివం, భన్వరీలాల్‌ పురోహిత్‌లు నివాళులు అర్పించారు. వైఎస్సార్‌సీపీ నేతల విజయసాయి రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, వరప్రసాద్‌లు వాజ్‌పేయి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. బాలీవుడ్‌ ప్రముఖులు జావేద్‌ అక్తర్‌, షబానా అజ్మీలు వాజ్‌పేయికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

అనంతరం వాజ్‌పేయి పార్థివదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించగా, ఆయనకు ఘనంగా తుది వీడ్కోలు పలికేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివస్తున్నారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు నివాళులర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, యూపీ ముఖ్యమంత్రి యూపీ సీఎం ఆదిత్యానాథ్‌ యోగిలు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు.  పార్టీలకు అతీతంగా బీజేపీ కేంద్ర కార్యాలయానికి నేతలు, ప్రజలు తరలివస్తున్నారు. వాజ్‌పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.  మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తర్వాత వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాజ్‌పేయి మృతి నేపథ్యంలో కేంద్రం ఈ నెల 22 వరకు సంతాప దినాలుగా ప్రకటించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top