అభివృద్ధి కోసమే భూబిల్లు | land pooling bill is for development only | Sakshi
Sakshi News home page

అభివృద్ధి కోసమే భూబిల్లు

Mar 24 2015 2:18 AM | Updated on Aug 15 2018 2:20 PM

అభివృద్ధి కోసమే భూబిల్లు - Sakshi

అభివృద్ధి కోసమే భూబిల్లు

భూసేకరణ బిల్లుకు మద్దతు పలకాలని ప్రధాని మోదీ రైతుల పిల్లలను కోరారు. అభివృద్ధి జరగాలంటే ఈ చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చట్టంతో రైతులకు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

  రైతుల పిల్లలు ఇతర ఉపాధి కావాలని కోరుకుంటున్నారు
     విపక్షాలు లేనిపోని ఆరోపణలతో తప్పుదోవ పట్టిస్తున్నాయి
     స్వర్ణదేవాలయాన్ని సందర్శించిన మోదీ
 హుస్సేనీవాలా(పంజాబ్): భూసేకరణ బిల్లుకు మద్దతు పలకాలని ప్రధాని మోదీ రైతుల పిల్లలను కోరారు. అభివృద్ధి జరగాలంటే ఈ చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చట్టంతో రైతులకు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీనిపై విపక్షాలు లేనిపోని ఆరోపణలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మోదీ మండిపడ్డారు.  సోమవారం పంజాబ్‌లోని హుస్సేనీవాలాలో జరిగిన స్వాతంత్య్ర అమరవీరులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల సంస్మరణ సభలో మోదీ మాట్లాడారు. ‘‘దేశం అభివృద్ధి చెందితే రైతులు, వారి తర్వాతి తరాలూ ప్రయోజనం పొందుతాయి. చాలామంది రైతుల పిల్లలు వ్యవసాయం వదిలి వేరే ఉపాధి కావాలని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు అభివృద్ధి లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? వారు ఢిల్లీ, ముంబైల్లోని మురికివాడల్లో ఉండాలని మీరు కోరుకుంటారా?’’ అని ఆయన ప్రశ్నించారు.
 ఆధునిక సాగు పద్ధతులు అవలంబించాలి:
 వ్యవసాయంలో ఎరువులను అధికంగా వినియోగిస్తుండటం పట్ల మోదీ ఆందోళన వ్యక్తంచేస్తూ.. దానివల్ల పంటలకు, భూసారానికి నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం వంటి ఆధునిక పద్ధతులను అవలంబించాలని విజ్ఞప్తిచేశారు. రైతులు గత ఏడాది లోటు వర్షపాతంతో సంక్షోభాన్ని ఎదుర్కోగా, ఈసారి వడగండ్లతో కడగండ్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.  దేశంలో విస్తృతమైన కాలువల వ్యవస్థ ఉందని, రైతుల పొలాలకు నీళ్లందించేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి కృషి యోజన’ను ప్రతిపాదించిందన్నారు. నదులను అనుసంధానం చేయాలని, పాత కాలువలను మరమ్మతు చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో పంజాబ్‌కు ఉద్యానవన సంస్థను ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసే ఈ సంస్థకు ‘సర్దార్ భగత్‌సింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్’గా నామకరణం చేస్తామని చెప్పారు.
 జలియన్‌వాలా బాగ్, స్వర్ణ దేవాలయ సందర్శన: పంజాబ్ పర్యటన సందర్భంగా మోదీ అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌ను సందర్శించి అక్కడ స్వాతంత్య్ర పోరాట అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. అనంతరం స్వర్ణదేవాలయాన్ని (శ్రీ హర్మందిర్ సాహిబ్‌ను) ఆయన సందర్శించారు. మోదీ ప్రధాని అయ్యాక ఈ దేవాలయాన్ని సందర్శించటం ఇదే తొలిసారి. ఆలయంలో దాదాపు 40 నిమిషాల పాటు గడిపిన మోదీకి ఆలయ గురువు సిరోపా (గౌరవ వస్త్రం) ప్రదానం చేశారు.
 కాగ్ అంచనా కన్నా పెద్ద స్కాం...
 దేశాన్ని అవినీతి భూతం విచ్ఛిన్నం చేసిందంటూ మోదీ యూపీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాగ్ అంచనావేసిన దానికంటే కోల్‌స్కామ్‌చాలా పెద్దది కావచ్చని.. దీనివల్ల దేశానికి చాలా నష్టం జరిగిందని మోదీ మండిపడ్డారు. ‘‘వారి పాపం వల్ల చాలా విద్యుత్ ప్లాంట్లు బొగ్గు కొరతతో మూతపడ్డాయి. మేము అధికారంలోకి వచ్చిన సమయంలో ఇది జరిగింది. అందువల్ల మేము బొగ్గు బ్లాకులను వేలానికి పెట్టాలని నిర్ణయించాం. 204 బ్లాకుల్లో 20 బ్లాకులను వేలం వేశాం. దీంతో సమకూరిన రూ. రెండు లక్షల కోట్లను ప్రభుత్వ ఖజానాలో జమ చేశాం. దీన్ని పేదల సంక్షేమానికి వినియోగిస్తాం. ఇంకా 180 బ్లాకులున్నాయి’’ అని మోదీ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement