యెడ్డీ ఆడియో క్లిప్పులపై సిట్‌ 

Kumaraswamy to Constitute SIT as Yeddyurappa Audio Clip  - Sakshi

కర్ణాటక సీఎం ప్రకటన 

యడ్యూరప్ప అభ్యంతరం 

బెంగళూరు: అధికార జేడీ(ఎస్‌)కు చెందిన ఎమ్మెల్యేను ప్రలోభపరిచేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ప్రయత్నించినట్లుగా ఉన్న ఆడియో క్లిప్పింగులపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)తో విచారణ చేయించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. అయితే, యడ్యూరప్ప ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. స్వయంగా ముఖ్యమంత్రే నిందితుడిగా ఉన్న ఈ కేసులో సిట్‌ దర్యాప్తుతో నిజాలు ఎలా వెలుగులోకి వస్తాయని ప్రశ్నించారు. యడ్యూరప్ప మాట్లాడినట్లు ఉన్న క్లిప్పింగుల్లో తన పేరును కూడా ప్రస్తావించినందున నిజాలు నిగ్గు తేల్చాలంటూ సోమవారం అసెంబ్లీలో స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ప్రభుత్వానికి సూచించారు.

నిజాయతీపరుడు, నిబద్ధత కలిగిన స్పీకర్‌ రమేశ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలను తప్పని రుజువు చేసి, ఆ పదవి ఔన్నత్యాన్ని కాపాడాలని అధికార పక్ష సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి కుమారస్వామి ఆ ఆడియో క్లిప్పింగులపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, క్లిప్పింగుల్లో స్పీకర్‌ పేరు ప్రస్తావనపై మాత్రమే విచారణను పరిమితం చేయాలని, లేకుంటే సిట్‌ను ప్రభుత్వం దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయంటూ ప్రతిపక్ష బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు.

తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అధికార కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి, ప్రతిపక్ష బీజేపీ కొంతకాలంగా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, క్యాంప్‌ రాజకీయాలు చేయడం విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల సీఎం కుమారస్వామి.. బీజేపీ నేత యడ్యూరప్ప జేడీ(ఎస్‌)కు చెందిన ఎమ్మెల్యేను ప్రలోభపెడుతున్నట్లుగా ఉన్న ఫోన్‌ సంభాషణ క్లిప్పింగులను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఒకవేళ అధికార పక్ష ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన చేరినట్లయితే స్పీకర్‌ వారికి అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చేందుకు గాను రూ.50 కోట్లు ఇద్దామంటూ యడ్యూరప్ప అన్నట్లుగా అందులో రికార్డయి ఉంది.  

యడ్యూరప్ప ఏమన్నారు? 
మొదట్లో వీటిని ఖండించిన యడ్యూరప్ప.. జేడీఎస్‌ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణ్‌ గౌడతో తాను మాట్లాడింది నిజమేనంటూ ఆదివారం ప్రకటించారు. అయితే, సీఎం ప్రోద్బ లంతోనే అతడు తనతో భేటీ అయ్యాడని ఆరోపించారు. అందులోని కీలక అంశాలను తొలగించి, తమకు అనువుగా ఉండేలా సంభాషణ క్లిప్పింగులు రూపొందించారని అన్నారు. శాసనసభ సమావేశాలకు గైర్హాజరవుతున్న నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కాంగ్రెస్‌ కోరింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top