
'నేరుగా పరామర్శించలేకపోయా'
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆకాంక్షించారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆకాంక్షించారు. శుక్రవారం ఆయన అపోలో ఆస్పత్రి సందర్శించారు. జయలలిత ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జయలలితను ప్రత్యక్షంగా పరామర్శించలేకపోయానని, ఆమెను చూసేందుకు ఎవరినీ లోపలకు అనుమతించడం లేదని రోశయ్య చెప్పారు. జయలలితకు అందిస్తున్న చికిత్స వివరాలు తనకు వైద్యులు చెప్పారని తెలిపారు.
68 ఏళ్ల జయలలిత అనారోగ్యంతో సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆమెకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది. ఆమెను చూసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. కాగా, ఆమె కోలుకోవాలని తమిళనాడులో అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు.